ముగిసిన మోదీ అమెరికా పర్యటన.. చాలా ప్రత్యేకమంటూ వీడియో షేర్ చేసిన ప్రధాని..

Published : Jun 24, 2023, 09:40 AM IST
ముగిసిన మోదీ అమెరికా పర్యటన.. చాలా ప్రత్యేకమంటూ వీడియో షేర్ చేసిన ప్రధాని..

సారాంశం

భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన  ముగిసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్‌ల ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించారు

భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన  ముగిసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్‌ల ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించారు. అమెరికా పర్యటన ముగింపు సందర్భంగా ప్రధాని మోదీ ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. చాలా ప్రత్యేకమైన యూఎస్‌ఏ పర్యటనను ముగించినట్టుగా చెప్పారు. యూఎస్ఏ పర్యటనలో భారత్-అమెరికాల స్నేహం మరింత ఊపందుకోవడం కోసం అనేక కార్యక్రమాలు, పరస్పర చర్యలలో పాల్గొన్నట్టుగా తెలిపారు. రాబోయే తరాలకు మన ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చేందుకు తమ దేశాలు కలిసి పని చేస్తూనే ఉంటాయని మోదీ పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్విట్టర్‌లో తన పర్యటనకు సంబంధించిన ముఖ్యమైన విశేషాలతో కూడిన వీడియోను కూడా మోదీ షేర్ చేశారు. ఇక, ప్రధాని మోదీ తన అమెరికా పర్యటనకు సంబంధించిన విశేషాలను పరిశీలిద్దాం.  ప్రధాని మోదీకి ఇది.. అమెరికాకు అఫీషియల్ స్టేట్ విజిట్(అమెరికా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు). తొలుత ప్రధాని మోదీ న్యూయార్క్ చేరుకున్నారు. అక్కడ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు, ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ స్వాగతం పలికారు. అలాగే ప్రధాని మోదీకి భారతీయ-అమెరికన్ కమ్యూనిటీ సభ్యుల నుంచి అద్భుతమైన స్వాగతం లభించింది. వారు ప్రధాని మోదీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ ఉత్సాహంగా కనిపించారు. 

న్యయార్క్ చేరుకున్న ప్రధాని వరుస సమావేశాలతో బిజీ బిజీగా గడిపారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ప్రముఖ పెట్టుబడిదారుడు, విశ్లేషకుడు రే డాలియో, ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీల్ డిగ్రాస్ టైసన్, నోబెల్ బహుమతి గ్రహీత పాల్ రోమర్.. వంటి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రధాని మోదీతో సమావేశమై చర్చలు జరిపారు. 

న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వివిధ దేశాలకు చెందిన వారితో కలిసి మోదీ యోగాసనాలు వేశారు. ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. జూన్ 22 న ప్రధాని మోదీ వాషింగ్టన్ చేరుకన్నారు. మోదీకి వైట్‌హౌస్‌లో ఘన స్వాగతం లభించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్‌లు మోదీ ఎదురొచ్చి స్వాగతం పలికారు. అనంతరం  ప్రధానికి గౌరవ సూచికంగా 19 గన్ సెల్యూట్‌తో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలపై బైడెన్, మోదీలు సంతకాలు చేశారు. 

 

ఇక, యూఎస్ పార్లమెంట్‌లో కూడా ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రధాని మోదీ ప్రసంగానికి అక్కడి సభ్యుల నుంచి విశేష స్పందన లభించింది. 2016 సంవత్సరంలో కూడా మోదీ యుఎస్ పార్లమెంట్‌లో ప్రసంగించారు. తాజాగా మరోసారి అక్కడ ప్రసంగించడంతో.. యూఎస్ పార్లమెంట్‌లో రెండుసార్లు ప్రసంగించిన మొదటి భారత ప్రధానిగా ఆయన నిలిచారు. ఆ తర్వాత జూన్ 22 సాయంత్రం ప్రెసిడెంట్ బైడెన్, ఆయన భార్య జిల్ బైడెన్ ప్రధాని మోదీకి అధికారిక విందును ఇచ్చారు. పలువురు భారతీయ ప్రముఖులతో కలిపి మొత్తం 400 మంది అతిథులు ఈ విందులో పాలుపంచుకున్నారు. 

జూన్ 23న ప్రధాని మోదీ అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌లతో సమావేశమయ్యారు. అదేరోజు మోదీ వాషింగ్టన్‌లో ఉన్న పలు కంపెనీల సీఈఓలు, ఇతర ముఖ్య వ్యక్తులతో కూడా సమావేశమయ్యారు. తర్వాత వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్‌లో ఉన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. అమెరికాలో'మినీ ఇండియా పుట్టుకొచ్చిందనీ.. ఇక్కడ 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారని  అభినందించారు. ఇక, అమెరికా పర్యటనలో భాగంగా వైట్‌హౌస్‌లో మీడియా ప్రశ్నలకు కూడా మోదీ సమాధానాలు ఇచ్చారు. 

ఈజిప్ట్ బయలుదేరిన మోదీ.. 
అమెరికా పర్యటన ముగించుకున్న అనంతరం.. ప్రధాని నరేంద్ర మోదీ ఈజిప్ట్‌కు బయల్దేరారు. ప్రధాని ఈజిప్ట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి ఆహ్వానం మేరకు ఈజిప్ట్‌కు వెళ్తున్న మోదీ..  రెండు రోజుల అక్కడ పర్యటించనున్నారు. 1997 తర్వాత భారత ప్రధాని ఈజిప్ట్‌లో చేసిన మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇదే. తన ఈజిప్ట్ పర్యటన సందర్భంగా.. ఆ దేశ అధ్యక్షుడితో చర్చలు జరపడమే కాకుండా ప్రధాని మోదీ ఈజిప్టు ప్రభుత్వంలోని సీనియర్ ప్రముఖులు, ప్రముఖ ఈజిప్టు వ్యక్తులు, భారతీయ సమాజంతో సంభాషించే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !