
ఫిలిప్పీన్స్‌లో వరదలు: ఫిలిప్పీన్స్‌లోని దక్షిణ ప్రావిన్స్‌లో కురిసిన కుండపోత వర్షాల కారణంగా వరదలు సంభవించాయి.ఇదే సమయంలో భారీ వర్షం దాటికి కొండచరియలు విరిగిపడ్డాయి. ఘటనల్లో కనీసం 42 మంది మృతి చెందగా, మరో 16 మంది గల్లంతయినట్లు అధికారులు తెలిపారు. ఈ వర్షం కారణంగా ప్రావిన్స్‌లో వరద పరిస్థితి తలెత్తిందని, దీని కారణంగా ప్రజలు తమ ఇళ్లలో చిక్కుకున్నారని అధికారులు తెలిపారు.
మంత్రి నగుయిబ్ సినారింబో ప్రకారం..మాగ్విండనావో ప్రావిన్స్‌లోని మూడు నగరాలు ప్రకృతి వైపరీత్యానికి ఎక్కువగా ప్రభావితమయ్యాయి. వరదల్లో మునిగిపోవడం లేదా శిథిలాలలో ఇరుకోవడంతో చాలా మంది మరణించారని తెలిపారు.
సినారింబో మాట్లాడుతూ, రాత్రంతా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. శిధిలాలు, నీరు పర్వతాల గుండా నదులలోకి ప్రవహించడంతో వరదలు వచ్చాయి. ప్రాణనష్టం పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం నుంచి వర్షం కాస్త తగ్గుముఖం పట్టిందని, దీంతో పలు నగరాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టిందని తెలిపారు.
మేయర్, గవర్నర్, విపత్తు నిర్వహణ అధికారుల నుండి అందిన సమాచారం ప్రకారం..పొరుగున ఉన్న తీర నగరాలైన దాతు ఓడిన్ సిన్సువాట్, దాతు బ్లా సిన్సువాత్‌లలో 26 మంది మరణించారని, ఉపి నగరంలో ఐదుగురు మరణించారని అధికారులు తెలిపారు.
నగరంలో ఐదుగురు వ్యక్తులు కనిపించకుండా పోయారని దాతు బ్లా సిన్సువాట్ మేయర్ మార్షల్ సిన్సుత్ తెలిపారు. సినారింబో ప్రకారం..ఇతర ప్రాంతాల్లో మరో నలుగురు అదృశ్యమయ్యారు. నల్గీ తుపాను కారణంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయని, శనివారం తూర్పు కోస్తా తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరింది. శుక్రవారం మధ్యాహ్నం ఉత్తర సమర్ ప్రావిన్స్‌లోని తూర్పు నగరమైన కేటర్‌మాన్ నుండి 180 కిలోమీటర్ల దూరంలో అల్ప పీడనం ఏర్పడిందనీ, ఇది వాయువ్య దిశగా కదులుతోందని, గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని ప్రభుత్వ వాతావరణ శాఖ హెచ్చరింది.
తుఫాను దృష్ట్యా రాజధాని మనీలాతో సహా డజన్ల కొద్దీ ప్రావిన్సులు , నగరాలను అప్రమత్తంగా ఉంచినట్లు కోస్ట్ గార్డ్ తెలిపింది. ఫిషింగ్ బోట్లు, కార్గో ఓడల అంతర్ ద్వీప ప్రయాణాన్ని నిషేధించామని, వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారని చెప్పారు. తుపాను దృష్ట్యా సుమారు ఐదు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు మరో అధికారి, ప్రభుత్వ వాతావరణ అంచనా విభాగం తెలిపారు.