చైనా సిటీ షాంఘైలో కఠిన లాక్‌డౌన్.. అపార్ట్‌మెంట్‌ల నుంచి ఫ్రస్ట్రేషన్‌తో ప్రజల కేకలు.. షాకింగ్ వీడియో ఇదే

Published : Apr 11, 2022, 04:14 PM IST
చైనా సిటీ షాంఘైలో కఠిన లాక్‌డౌన్.. అపార్ట్‌మెంట్‌ల నుంచి ఫ్రస్ట్రేషన్‌తో ప్రజల కేకలు.. షాకింగ్ వీడియో ఇదే

సారాంశం

చైనాలో కరోనా వెలుగు చూసినప్పటి నుంచి అత్యధిక కేసులు షాంఘైలో రిపోర్ట్ అవుతున్నాయి. చైనా నగరం షాంఘైలో ఈ నెల 5వ తేదీన కఠోర లాక్‌డౌన్ అమలు అవుతున్నది. అప్పటి నుంచి ప్రజలు తమ ఇంటికే పరిమితం అయ్యారు. కఠిన నిబంధనలతో ప్రజలు మానసికంగా క్షోభ అనుభవిస్తున్నట్టు తెలుస్తున్నది. రాత్రిపూట షాంఘై నగరంలోని అపార్ట్‌మెంట్ల నుంచి బిగ్గరగా అరుపులు, పెడబొబ్బలు వినిపిస్తున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నది.  

న్యూఢిల్లీ: చైనాలో అత్యధిక జన సమ్మర్ధ నగరం షాంఘైలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ కేసులు రికార్డులు తిరగరాస్తున్నాయి. కరోనా వైరస్ తొలిసారి ఈ దేశంలోని వుహాన్‌లో వెలుగు చూసినప్పటి నుంచి అత్యధిక సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో షాంఘై నగరంలో కఠోర లాక్‌డౌన్‌ను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఈ నగరంలో ప్రజలు అంతా తమ ఇంటికే పరిమితం అయ్యారు. ఈ లాక్‌డౌన్‌ అక్కడి ప్రజల్లో తీవ్ర వేదనను నింపుతున్నది. వారు ఫ్రస్ట్రేషన్‌లోకి వెళ్తున్నారు. దాదాపు ‘ఎప్పుడు చస్తాం రా దేవుడో’ అన్నట్టుగా అరుస్తున్నారు. ఆకాశ హర్మ్యాల నుంచి మానసిక చింత, క్షోభతో రాత్రి పూట వారు అరుస్తున్న అరుపులు బెంబేలెత్తిస్తున్నాయి. ఆ వాతావరణంలో విషాదం ధ్వనిస్తున్నది. అరుపులతో నిండిన ఆ బిల్డింగ్‌లను ఓ వ్యక్తి రికార్డు చేసి వీడియోను ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

ఏప్రిల్ 5వ తేదీన షాంఘైలో కఠినమైన లాక్‌డౌన్ విధించారు. కరోనా మహమ్మారిని వ్యాపించకుండా అడ్డుకోవడానికి ముఖ్యంగా ఆ దేశ ప్రభుత్వం అమలు చేస్తున్న జీరో కోవిడ్ విధానానికి అనుగుణంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. దీంతో 2.60 కోట్ల జనాభా ఆ నగరంలో తమ ఇళ్లకే పరిమితం అయ్యారు. అమెరికాకు చెందిన ప్రజా ఆరోగ్య శాస్త్రవేత్త డాక్టర్ ఎరిక్ ఫెగల్ డింగ్ ఈ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు.

వారంతా యావో మింగ్ లే అని, యావో సి అని అరుస్తున్నారని ఆయన చెప్పారు. ఇది చైనీస్ మాండలికం అని వివరించారు. ఎక్కువగా షాంఘైలో మాట్లాడుతారని తెలిపారు. ఈ పదాల అర్థం జీవితం మరియు చావు అని పేర్కొన్నారు. అంటే వారు దాదాపు చావును అడుగుతున్నారనే అర్థం అని తెలిపారు.

కాగా, ఆరోగ్య నిపుణులు ప్రస్తుతం చైనా గరిష్ట స్థాయిలో కేసులు నమోదు చేస్తున్నదని వివరించారు. బీఏ.2 వేరియంట్ కారణంగా షాంఘైలో రికార్డు స్థాయిల్లో కేసులు రిపోర్ట్ అవుతున్నాయన్నారు.

షాంఘైలో రోజువారీగా సుమారు 25 వేల కేసులు నమోదు అవుతున్నాయి. ఆదివారం ఒక్క రోజే ఈ ఒక్క నగరంలోనే దాదాపు 25 వేల కేసులు నమోదయ్యాయి. కరోనా కఠోర లాక్‌డౌన్ కారణంగా ఆహారం, ఇతర సరుకుల సరఫరా సవాలుగా మారింది. స్థానికులు కూడా ఈ అంశంపై ఆందోళనలు వెలిబుచ్చుతున్నారు. కాగా, ఇదే పరిస్థితి ఇతర నగరాలకూ వ్యాపించనుందా? అనే భయాలు నెలకొంటున్నాయి.

ప్రపంచంలోని ఇతర పెద్ద పెద్ద నగరాలతో పోలిస్తే 25వేల కేసులు భారీగా ఏమీ అనిపించకపోవచ్చు. కానీ, చైనాలో జీరో కోవిడ్ విధానం ఉన్నది. ఇక్కడ ఒక్క కొవిడ్ కేసు రిపోర్ట్ అయినా.. సీరియస్ యాక్షన్స్ తీసుకుంటారు. 2019లో వుహాన్‌లో తొలిసారి కరోనా వెలుగు చూసినప్పటి నుంచి ఈ స్థాయిలో కేసులు చైనాలో రిపోర్ట్ కావడం ఇదే తొలిసారి. నేడు షాంఘై నగర వీధులు ఎడారిని తలపిస్తున్నాయి. కేవలం ఆరోగ్య సిబ్బంది, డెలివరీ సిబ్బంది, ఇతర వాలంటీర్లు మాత్రమే కనిపిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే