
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో సుమారు నెల రోజుల నుంచి జరుగుతున్న హైడ్రామా ఇవాళ్టికి ఒక కొలిక్కి వచ్చింది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఆయన ప్రధాని పదవిని కోల్పోయారు. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో రేపు ఆయన పార్టీ రాజీనామా చేయనున్నట్టు సమాచారం. అయితే, ఆయనపై అవిశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత ఆయన తొలిసారిగా ట్విట్టర్‌లో రెస్పాండ్ అయ్యారు.
పాకిస్తాన్ 1947లో స్వాతంత్ర్య దేశంగా అవతరించిందని పేర్కొన్నారు. కానీ, ప్రభుత్వాన్ని కూల్చేసిన విదేశీ కుట్రకు వ్యతిరేకంగా నేటి నుంచే మరో స్వాతంత్ర్య పోరాటం మొదలైందని వివరించారు. ఈ దేశ సమగ్రతను, ప్రజాస్వామ్యాన్ని కాపాడేవారు ఎప్పుడూ ఈ దేశ ప్రజలే అని ఆయన ట్వీట్ చేశారు.
దేశ సమగ్రతనూ ప్రజలే కాపాడుతారని పేర్కొని పాకిస్తాన్ మిలిటరీకి ఆయన కౌంటర్ ఇచ్చారా? అనే చర్చ మొదలైంది. ఎందుకంటే ఒక వైపు దేశంలో ప్రభుత్వాన్ని మార్చడానికి విదేశీ శక్తులు పని చేశాయని ఆరోపిస్తూ స్వాంతంత్ర్యం సమరం మళ్లీ మొదలైందని పేర్కొన్నారు. స్వతంత్ర సమరం అని పేర్కొంటూనే దేశ సమగ్రతను, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వారు ఎల్లప్పుడూ దేశ ప్రజలే అని స్పష్టం చేశారు. ఈ ట్వీట్‌లో దేశ మిలిటరీని తక్కువ చేశారా? అనే ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకంటే.. పాకిస్తాన్ మిలిటరీ మద్దతు కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్ ఆ వెంట వెంటనే పదవీ గండాన్ని ఎదుర్కొన్నారు. చివరకు ప్రధాని పదవినీ కోల్పోవాల్సి వచ్చింది. ఓ మిలిటరీ అధికారి నియామకంలో జాప్యంతో ఆయనకు మిలిటరీకి చెడిందనే వాదనలు ఉన్నాయి. చివరి వరకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పాకిస్తాన్ మిలిటరీకి మధ్య విభేదాలు కొనసాగాయి.
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శనివారం ఓటింగ్ నిర్వహించారు. తీవ్ర ఉద్రిక్తతలు, నాటకీయ పరిణామాల మధ్య ఈ ఓటింగ్ పూర్తయ్యింది. దీంతో చివరికి ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ వైదొలగాల్సి వచ్చింది. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 174 మంది సభ్యులు ఈ తీర్మానానికి మద్దతుగా ఓటు వేశారు. ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి దించేయాలంటే ప్రతిపక్షానికి 172 ఓట్లు అవసరం ఉండగా.. రెండు ఓట్లు ఎక్కువగానే వచ్చాయి. అయితే పాక్ కొత్త ప్రధానిగా ఖాన్ స్థానంలో ప్రతిపక్ష నేత షెహబాజ్ షరీఫ్ ఎంపికయ్యే అవకాశం ఉంది.
మార్చి 30వ తేదీన ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రతిపక్షాలన్నీ కలిసి షెహబాజ్ షరీఫ్ ఎంపిక చేసినట్టు చెప్పారు. నేడు (ఆదివారం) ఆయన పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీని కూడా కలవనున్నారు. కాగా సభా నాయకుడిని అధికారికంగా ఎన్నుకునేందుకు జాతీయ అసెంబ్లీ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి సమావేశం కానుంది.