
Russia Ukraine Crisis: ఉక్రెయిన్-రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధం ఆదివారం 46వ రోజుకు చేరుకుంది. యుద్ధం కారణంగా ఇరు దేశాలకు భారీగా నష్టం జరిగింది. మరీ ముఖ్యంగా ఉక్రెయిన్ లోని చాలా ప్రాంతాలు శిథిలాల దిబ్బగా మారాయి. సాధారణ పౌరులు సైతం ప్రాణాలు కోల్పోవడం క్రమంగా పెరుగుతోంది. యుద్ధంలో తీవ్రంగా దెబ్బతిన్న ఉక్రెయిన్.. తూర్పున రష్యా దళాలతో భీకర పోరుకు సిద్ధమైంది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లోదిమిర్ జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. రాజధాని నగరమైన కైవ్‌కు ముప్పు తగ్గినప్పటికీ, తూర్పు ప్రాంతంలో అది పెరుగుతోందని హెచ్చరించారు. "ఇది కఠినమైన యుద్ధం అవుతుంది, ఈ పోరాటంలో విజయంపై మాకు నమ్మకం ఉంది. మేము ఏకకాలంలో పోరాడటానికి సిద్ధంగా ఉన్నాము. ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు దౌత్య మార్గాలను వెతకడానికి సిద్ధంగా ఉన్నాము" అని పేర్కొన్నారు. కీలకమైన ఓడరేవు నగరం మారియుపోల్‌లో రష్యన్ దళాలు దాడులు జరిపి మానవతా కారిడార్‌లను ధ్వంసం చేసింది. నివాసితుల తరలింపును అడ్డుకుంది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి సంబంధించి తాజా అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి..
1. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని కలిశారు."అధ్యక్షుడు జెలెన్స్కీ దృఢమైన నాయకత్వం మరియు ఉక్రేనియన్ ప్రజల అజేయమైన పరాక్రమం మరియు ధైర్యం కారణంగా పుతిన్ భయంకరమైన లక్ష్యాలు విఫలమవుతున్నాయి" అని బోరిస్ జాన్సన్ అన్నారు. ఉక్రెయిన్ కు సాయుధ వాహనాలు, నౌకా వ్యతిరేక క్షిపణులను కూడా అందిస్తామని తెలిపారు.
2. ఉక్రేనియన్ అధికారులు దేశం తూర్పున ఉన్న నివాసితులను వెంటనే ఖాళీ చేయాలని సూచించారు. దక్షిణాన మారియుపోల్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది.
3. రాజధాని కైవ్ సమీపంలోని విముక్తి పొందిన గ్రామమైన బుజోవాలో డజన్ల కొద్దీ ఉక్రెయిన్ పౌరులతో కూడిన సామూహిక సమాధిని గుర్తించారు. ఈ ప్రాంతం కొన్ని వారాలపాటు రష్యా దళాలచే ఆక్రమించబడిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
4. ఉక్రెయిన్- రష్యాలు ఖైదీల మార్పిడికి అంగీకరించాయి. దీంతో 26 మంది ఉక్రేనియన్లు స్వదేశానికి తిరిగి వస్తారని కైవ్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వీరిలో తొమ్మిది మంది మహిళలు, పన్నెండు మంది సైనికులతో సహా పద్నాలుగు మంది పౌరులు ఉన్నారు.
5. శాంతి స్థాపన కోసం తాను కట్టుబడి ఉన్నాననీ, మరిన్ని ఆయుధాలను పంపాలని దేశాలకు తన అభ్యర్థనను పునరుద్ధరించానని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు.
6. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో కూటమి తూర్పు సరిహద్దులో శాశ్వత దళాల ఉనికి కోసం నాటో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. NATO సెక్రటరీ-జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
7. ఉక్రెయిన్.. రష్యా నుంచి అన్ని దిగుమతులను నిషేధించింది. యుద్ధానికి ముందు దాని కీలక వాణిజ్య భాగస్వాములలో ఒకటైన వార్షిక దిగుమతుల విలువ సుమారు $6 బిలియన్లు.. ఇతర దేశాలను అనుసరించి కఠినమైన ఆర్థిక ఆంక్షలను విధించాలని పిలుపునిచ్చింది.
8. యురోపియన్ యూనియన్ సభ్యత్వం కోసం సిద్ధం కావాల్సిన చర్యల జాబితాపై వేగంగా వెళ్లేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉంది. జూన్‌లోగా అభ్యర్థి హోదాను అందుకోవాలని భావిస్తోందని ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు.
9. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని నిరసిస్తూ చిలీ రాజధాని శాంటియాగోలోని రష్యా రాయబార కార్యాలయం ముందు డజన్ల కొద్దీ నిరసనలకు దిగారు. ఆందోళనకారులు ఉక్రెయిన్ జెండా రంగులతో కూడిన పెద్ద బ్యానర్‌ను ఆవిష్కరించారు. ఈ బృందంలో చిలీలో నివసిస్తున్న ఉక్రేనియన్లు ఉన్నారు.
10. కైవ్‌ను స్వాధీనం చేసుకోవడంలో మాస్కో సైన్యం విఫలమవడంతో ఉక్రెయిన్‌లో యుద్ధానికి నాయకత్వం వహించడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యా సదరన్ మిలిటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ అలెగ్జాండర్ డ్వోర్నికోవ్‌ను నియమించారు.