Pakistan train hijack: బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో మిలిటెంట్లు హైజాక్ చేసిన ప్యాసింజర్ రైలు నుంచి 300 మందికి పైగా బందీలను పాకిస్తాన్ ఆర్మీ విజయవంతంగా విడిపించిందని సైనిక అధికారులు బుధవారం తెలిపారు.
Pakistan train hijack: బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో మిలిటెంట్లు బందీలుగా చేసుకున్న రైలు ప్రయాణికులందరినీ పాకిస్తాన్ ఆర్మీ కాపాడిందని సైనిక అధికారులు బుధవారం చెప్పారు. ఈ ఆపరేషన్‌లో కనీసం 33 మంది మిలిటెంట్లు చనిపోయారు. 27 మంది ఆఫ్ డ్యూటీ సైనికులు, ఒక ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. "346 మంది బందీలను విడిపించాం. 30 మందికి పైగా టెర్రరిస్టులను చంపాం" అని ఒక ఆర్మీ అధికారి ఏఎఫ్పీకి చెప్పారు.
సుమారు 400 మంది ప్రయాణికులతో క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను పేలుడు పదార్థాలు ఉపయోగించి మిలిటెంట్లు పట్టాలు తప్పించి తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ దాడి క్వెట్టాకు 160 కిలోమీటర్ల దూరంలో గుడలార్, పిరు కున్రి పర్వత ప్రాంతాల దగ్గర జరిగింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఈ హైజాకింగ్ చేసినట్టు ప్రకటించుకుంది. ప్యాసింజర్ రైలును టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి.
మిలిటెంట్లు మహిళలు, పిల్లలను అడ్డుగా పెట్టుకుని ఈ హైజాక్ కు పాల్పడటంతో రైలును తిరిగి స్వాధీనం చేసుకునే ఆపరేషన్‌ను చాలా జాగ్రత్తగా చేశామని సైనిక అధికారులు తెలిపారు. మిగిలిన బందీలను సురక్షితంగా కాపాడే ముందు 190 మంది ప్రయాణికులను రక్షించారు. గాయపడిన కొంతమంది ప్రయాణికులను ఆసుపత్రులకు తరలించారు.
దాదాపు 70 నుంచి 80 మంది మిలిటెంట్లు ఈ దాడిలో పాల్గొన్నారని హోం శాఖ సహాయ మంత్రి తలాల్ చౌదరి చెప్పారు. అలాగే, తప్పుడు సమాచారంపై వివరణ ఇచ్చారు. ఆ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశామనీ, సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు అన్నీ ఫేక్ అని తెలిపారు.
మిలిటెంట్లు గుర్తింపు కార్డుల ఆధారంగా ప్రయాణికులను వేరు శారని ఈ హైజాక్ నుంచి బయటపడిన ముస్తాక్ ముహమ్మద్ అనే ప్రయాణికుడు చెప్పాడు. అలాగే, "వాళ్లు పిల్లలు, మహిళలు, వృద్ధులు, బలూచ్ ప్రయాణికులను ఏమీ చేయమని చెప్పారు" అని కూడా తెలిపారు.
భార్య, ఇద్దరు పిల్లలతో ప్రయాణిస్తున్న ఇషాక్ నూర్ అనే వ్యక్తి కాల్పులు ఎంత తీవ్రంగా ఉన్నాయో వివరిస్తూ.. రైలు కిటికీలు, తలుపులు పగిలిపోయానని చెప్పారు. నిరంతరం కాల్పులు జరుగుతూనే ఉన్నాయనీ, బుల్లెట్ల నుంచి కాపాడటానికి మా పిల్లలను మా కింద దాచామని చెప్పారు. ఆ ప్రాంతంలో ఇంకా ఏమైనా ముప్పు ఉంటే వాటిని తొలగించడానికి సెర్చ్ ఆపరేషన్ ఇంకా జరుగుతోందని పాకిస్తాన్ మిలిటరీ తెలిపింది. హైజాకింగ్‌లో పాల్గొన్న టెర్రరిస్టులందరినీ చంపేశామని స్టేట్ రన్ రేడియో పాకిస్తాన్ ధృవీకరించింది.
ఈ దాడిని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనను "భయంకరమైన చర్య" అని యూఎస్ ఎంబసీ పేర్కొంది. బాధితులకు సంతాపం తెలిపింది. యూరోపియన్ యూనియన్ రాయబారి రీనా కియోంకా కూడా దాడిని ఖండించారు. బందీలను వెంటనే విడుదల చేయాలని కోరారు.
బలూచిస్తాన్ చాలా సంవత్సరాలుగా తిరుగుబాటుకు కేంద్రంగా ఉంది. బీఎల్ఏ వంటి వేర్పాటువాద గ్రూపులు ఇస్లామాబాద్ ప్రావిన్స్‌లోని ఖనిజ వనరులను దోపిడీ చేస్తోందని చెబుతూ ఎక్కువ స్వయంప్రతిపత్తి లేదా స్వాతంత్య్రం కావాలని డిమాండ్ చేస్తున్నాయి. గత సంవత్సరం నుంచి టెర్రరిస్ట్ దాడులు పెరిగాయి. తిరుగుబాటుదారులు భద్రతా దళాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను టార్గెట్ చేస్తున్నారు. వీటిలో 60 బిలియన్ డాలర్ల చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) కూడా ఉంది. తమ వాళ్ల గురించి సమాచారం కోసం వెతుకుతున్న కుటుంబాలకు సహాయం చేయడానికి పాకిస్తాన్ రైల్వేస్ పెషావర్, క్వెట్టా రైల్వే స్టేషన్లలో ఎమర్జెన్సీ డెస్క్‌లను ఏర్పాటు చేసింది.