
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై మాజీ హాకీ ప్లేయర్ విమర్శలు చేసినందుకు నిషేధం పడింది. 1984 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన పాకిస్థాన్ హాకీ జట్టు సభ్యుడు రషీద్ అల్ హసన్ 10 సంవత్సరాల నిషేధానికి గురయ్యాడు. అయితే పాకిస్థాన్ క్రీడా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అభ్యంతరకర పదజాలం వాడినట్లు రషీద్‌పై ఆరోపణలు వచ్చాయని తెలిపారు.
పాకిస్థాన్‌కు చెందిన ఒక వార్తాపత్రిక ప్రకారం, 62 ఏళ్ల రషీద్ అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించానన్న ఆరోపణలను ఖండిస్తూ, న్యాయస్థానంలో నిషేధాన్ని సవాలు చేసేందుకు పరిశీలిస్తున్నట్లు నివేదించింది. దేశంలో క్రీడల క్షీణతపై సోషల్ మీడియా వేదికగా పీహెచ్‌ఎఫ్ పాట్రన్-ఇన్-చీఫ్ అయిన ప్రధాని ఖాన్‌ను విమర్శించారన్నా తర్వాత పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ (PHF) గురువారం అతడిని పదేళ్లపాటు నిషేధించింది.
నిషేధంపై తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన రషీద్ ప్రస్తుతం తాను ఫెడరేషన్‌లో ఎలాంటి పదవిని చేపట్టడం లేదని చెప్పాడు. మరోవైపు ప్రధాని ఖాన్‌కు వ్యతిరేకంగా రషీద్ అనుచిత పదజాలం ఉపయోగించాడో లేదో తెలుసుకోవడానికి పిహెచ్‌ఎఫ్ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ విషయంపై రషీద్ మాట్లాడుతూ.. 'సోషల్ మీడియా నుండి పబ్లిక్ ఫోరమ్‌ల వరకు నేను ఎప్పుడూ ప్రధానిని గౌరవిస్తాను. హాకీని సరైన దారిలో తీసుకెళ్తానని ఇమ్రాన్ ఖాన్ చెప్పారని, అయితే గత మూడేళ్లలో అలాంటిదేమీ జరగలేదని వాట్సాప్ గ్రూప్‌లో రాశాను. నేను దేశ పౌరుడిగా మాట్లాడే హక్కు నాకు ఉంది, కానీ ప్రధానిపై అనుచిత పదజాలం ఉపయోగించలేదు."అని అన్నారు.
ఒక ప్రకటన ప్రకారం పిహెచ్‌ఎఫ్ ప్రెసిడెంట్ బ్రిగ్ (రిటైర్డ్.) ఖలీద్ సజ్జాద్ ఖోఖర్ అండ్ సెక్రటరీ ఆసిఫ్ బజ్వా ఆదేశాలు ఇచ్చారు. అయితే రెండు నోటీసులకు రషీద్ స్పందించకపోవడంతో పిహెచ్‌ఎఫ్ అధ్యక్షుడి సూచనలపై కమిటీ 10 సంవత్సరాల నిషేధాన్ని విధించింది. అలాగే నోటిఫికేషన్ కాపీని జాతీయ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ ఆన్ స్పొర్ట్స్ కి కూడా పంపారు.
రషీద్ ప్రకారం, అతను ఐదు నెలల క్రితం పిహెచ్‌ఎఫ్ నుండి మొదటి నోటీసును అందుకున్నానని , "ఇందులో దీనికి సంబందించి ఎటువంటి సమాచారం లేదని, అందుకే నేను దానిని ఎక్కువగా పరిగణించలేదు" అని అన్నారు. “నాకు 45 రోజుల క్రితం రెండో నోటీసు వచ్చింది. నేను ప్రధానికి వ్యతిరేకంగా దుర్భాషలాడినట్లు వచ్చిన ఆరోపణలను అంగీకరించడానికి నిరాకరిస్తూ పిహెచ్‌ఎఫ్‌కి చిన్న సమాధానం రాశాను, ”అని అన్నారు.
రషీద్‌పై నిషేధాన్ని అమలు చేయడానికి తదుపరి చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ అండ్ ఇతర సంబంధిత సంస్థలకు లేఖలు జారీ చేయాలని పిహెచ్‌ఎఫ్ పాకిస్తాన్ స్పోర్ట్స్ బోర్డ్ (PSB)ని అభ్యర్థించినట్లు ఒక నివేదిక పేర్కొంది.