
న్యూఢిల్లీ: ఎవరైనా కొత్త వ్యక్తులు సున్నిత ప్రాంతాల్లో తిరిగితే.. అదీ అనుమానంగా కనిపిస్తే అధికారులు అలెర్ట్ అవుతారు. వెంటనే పట్టుకుని విచారిస్తారు. సెక్యూరిటీ కోసం ఈ పని ఏ దేశంలోనైనా చేసేదే. ఇదంతా అనుమానంగా మనుషులు తిరిగితే చేసే తంతు. అదే ఓ జంతువో.. పక్షో.. మరే ఇతర జీవో తిరిగితే.. ఎవరూ పట్టుకుని విచారించరు. అసలు అది అనుమానిత పనిగానే పరిగణించరు. కానీ, అమెరికా (America)లో ఓ వింత ఘటన జరిగింది. కోడి (Chicken) అనుమానితంగా తిరుగుతున్నదని అక్కడి పోలీసులు అదుపులో(Custody)కి తీసుకున్నారు. దాన్ని విచారించలేం కదా.. అందుకే జంతు సంక్షేమ సంఘాన్ని పిలిచి అప్పగించారు. కొంత ఎబ్బెట్టుగా అనిపిస్తున్నా.. ఇది నిజంగా జరిగినదే. ఆ కోడిని తెచ్చుకున్న అర్లింగ్‌టన్‌కు చెందిన యానిమల్ వెల్ఫేర్ లీగ్ ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేయడంలో పోస్టు వైరల్ (Viral) అయింది.
అమెరికాలో అతి సురక్షమైన ప్రాంతం పెంటగాన. అగ్రరాజ్యం అమెరికా భద్రతలో అన్ని దేశాల కంటే ముందే ఉంటుంది. ఈ భద్రతకు కేంద్రం పెంటగాన్. అందుకే ఇక్కడ చీమ చొరబడ్డా అనుమానంగానే చూస్తారనే అతిశయ వ్యాఖ్యలు ఇప్పుడు వాస్తవానికి దగ్గరగా వచ్చాయి. పెంటగాన్ సెక్యూరిటీ ప్రాంతంలో ఓ కోడి కనిపించింది. అది అనుమానం కలిగించేలా రోడ్డును క్రాస్ చేసినట్టు అక్కడి పోలీసులకు అనిపించింది. సోమవారం తెల్లవారుజామున యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ హెడ్‌క్వార్టర్స్ సమీపంలో ఈ కోడి వారికి కనిపించింది. ఇందులో ఏదో మతలబు ఉన్నదని, లేదా మరేదో కుట్ర కోణం దాగి ఉన్నదని వారి ఆలోచనలకు వచ్చింది. దీంతో వెంటనే ఆ కోడిని పట్టుకున్నారు. ఆ బ్రౌన్ కలర్ కోడిని అటూ ఇటూ పరికించి చూశారు. ఏమీ లేదు. అయినా వదిలిపెట్టలేదు. ఎందుకు చాన్స్ తీసుకోవడం అనుకున్నారేమో.. వర్జీనియాలోని అర్లింగ్‌టన్‌కు చెందిన యానిమల్ వెల్ఫేర్ లీగ్‌కు ఫోన్ చేసి ఈ కోడిని తీసుకెళ్లాల్సిందిగా కోరారు.
ఈ విషయాన్ని ఆ యానిమల్ వెల్ఫేర్ లీగ్ ఉద్యోగి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాన్ని సురక్షితంగా వెంట బెట్టుకుని తీసుకువచ్చినట్టు పేర్కొన్నారు. అంతటితో ఊరుకోలేదు. ఆ యానిమల్ వెల్ఫేర్ లీగ్ సోషల్ మీడియాలో ఆ కోడికి మంచి పేరు పెట్టాలని యూజర్లను కోరింది. చాలా పేర్లు రాగా.. అందులో నుంచి హెన్నీ పెన్నీ అనే పేరును దానికి ఖరారు చేసింది. అయితే, ఆ కోడి పెంటగాన్ ప్రాంతానికి ఎలా వచ్చిందని? ఎక్కడ నుంచి వచ్చిందనే విషయాలను ఎవరూ వెల్లడించలేదు.
పనిలో పనిగా.. ఆ కోడి కథను క్యాపిటలైజ్ చేసుకోవడమూ చేసిందా సంస్థ. ఓ కోడి బొమ్మ.. హెన్నీ పెన్నీ అనే పేరును ప్రింట్ చేసి టీషర్టలను రెడీ చేసింది. ఇంటరెస్ట్ ఉన్నవారు తమకు ఆర్డర్ పెట్టాల్సిందిగా కోరింది. ఈ టీ షర్టులు కావాలని ఎవరూ అడక్కపోయినా.. తామే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. కాగా, ఆ కోడిని స్థానికంగా ఉన్నా ఓ లోకల్ యానిమల్ శాంక్చుయరీకి అందించబోతున్నట్టు వెల్లడించింది.