
నైజీరియా : ఆఫ్రికా దేశం నైజీరియాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో ఆ దేశం జలమయమై పోయింది. దశాబ్దకాలంలో ఈ స్థాయిలో ఎప్పుడూ వరదలు రాలేదని అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. భీకర వరదల కారణంగా 600 మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఇళ్లు కొట్టుకుపోవడం, నీట మునిగిపోవడంతో దాదాపు 13 లక్షల మంది నిరాశ్రయులుగా మారారు. అయితే, రాష్ట్రాల్లో అనేక హెచ్చరికలు చేసినప్పటికీ సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు పూర్తిగా సిద్ధం కాలేదని.. అందుకే ప్రాణనష్టం భారీ స్థాయిలో ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
నైజీరియా మానవతా వ్యవహారాలు, విపత్తు నిర్వహణ మంత్రి ఉమర్ ఫరూక్ ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రమాదం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించే ప్రజలను ఖాళీ చేయించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఈ భారీ విపత్తులో ఇప్పటివరకు దాదాపు రెండు లక్షల ఇళ్లు కొట్టుకుపోయాయని అధికారులు అంచనా వేస్తున్నారు. చివరి వరకు కూడా అక్కడ వర్షాలు, వరదలు కొనసాగే అవకాశం ఉంది.
బాలికకు జో బైడెన్ డేటింగ్ సలహా.. వీడియో వైరల్.. అందులో ఏమన్నారంటే..
ఇదిలా ఉండగా, అక్టోబర్ 10న వెనిజులాలో ఇలాంటి ప్రమాదమే సంభవించింది. సెంట్రల్ వెనిజులాలో కొండచరియలు విరిగిపడటంతో అక్కడి నది పొంగిపొర్లాయి. దీంతో ఈ ప్రమాదంలో కనీసం 25 మంది మరణించారు, 52 మందికి పైగా గల్లంతయ్యారు. దేశంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే ఈ ఘోరమైన విపత్తు సంభవించిందని అధికారులు తెలిపారు. రాత్రి కురిసిన వర్షం కారణంగా కారకాస్‌కు నైరుతి దిశలో 40 మైళ్ల (67 కిలోమీటర్లు) దూరంలో ఉన్నటెజెరియాస్ కమ్యూనిటీకి చుట్టుపక్కల ఉన్న పర్వతాలమీది పెద్ద చెట్ల కొమ్మలు, కొండచరియలు విరిగిపడడంతో భారీగా నష్టం వాటిల్లిందని తెలిపారు.
అధిక వర్షపాతం కారణంగా దక్షిణ అమెరికా సంక్షోభంలో పడింది. ఇటీవలి నెలల్లో డజన్ల కొద్దీ ప్రజలు ఈ వర్షాలకారణంగా ప్రాణాలు కోల్పోయారు. "అన్నింటికంటే అది పెద్ద నష్టం ప్రాణాలు కోల్పోవడం.. ఇప్పటికే 22 మంది చనిపోయారు. 52 మందికి పైగా గల్లంతయ్యారు. ఇది అత్యంత భయంకరమైన పరిస్థితి. గల్లంతైన వారిని కనిపెట్టే ప్రయత్నాల్లో ఉన్నాం" అని లాస్ టెజెరియాస్ వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ స్థానిక మీడియాతో అన్నారు. ఈ ప్రమాణంలో ప్రాణ నష్టంతో పాటు ఇళ్ళు, వ్యాపారాలు ధ్వంసమయ్యాయి. విరిగిపడిన చెట్లతో పట్టణంలోని వీధులన్నీ నిండిపోయాయి. వీటికి తోడు వరదల కారణంగా వచ్చి చేరిన బురద, శిధిలాలతో పరిస్తితి బీభత్సంగా మారింది.
"తమ గ్రామం పూర్తిగా పోయిందని.. లాస్ టెజెరియాస్ పాడైపోయిందని" ఓ 55 ఏళ్ల స్థానికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు వెయ్యి మంది సిబ్బంది రెస్క్యూ ప్రయత్నాలలో నిమగ్నమయ్యారు. "మారుతున్న వాతావరణం ఫలితంగా భారీ కొండచరియలు విరిగిపడుతున్నాయి" అని ఓ అధికారి అన్నారు. ఈ ప్రమాదానికి ముందు రోజు రాత్రి వెనిజులాకు ఉత్తరాన జూలియా హరికేన్ ప్రభావం దాటిపోయింది. దీన్ని ప్రస్తావిస్తూ...ఈ సారి "రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది" అని.. సాధారణంగా ఒక నెలలో కురిసేంత పెద్ద వర్షం ఒకే రోజులో కురిసింది అని.. చెప్పుకొచ్చాడు.
రెస్క్యూ టీమ్‌ల డ్రోన్‌లతో తీసిన ఫొటోల్లో వీధుల్లో భారీ మొత్తంలో పోగైన మట్టి కనిపిస్తుంది. అధ్యక్షుడు నికోలస్ మదురో బాధితుల కోసం మూడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు. దీనితోపాటు వెనిజులా ప్రజలు ఈ ప్రమాదానికి సహాయహస్తం అందించాలంటూ ఫేస్ బుక్ లో విజ్ఞప్తి చేస్తున్నారు. కారకాస్ బేస్ బాల్ జట్టు లాస్ లియోన్స్ బాధితుల కోసం "ఆహారం, నీరు, బట్టలు" సేకరణ కోసం నడుంకట్టింది.
30 సంవత్సరాలలో ఇదే అతిపెద్ద ప్రమాదంగా అక్కడివారు చెబుతున్నారు. ఆగస్టులో, వెనిజులాలోని అండీస్‌లో భారీ వర్షాల కారణంగా మట్టి, రాక్ స్లైడ్‌ల కారణంగా కనీసం 15 మంది మరణించారు. సెప్టెంబరులో, దేశంలోని పశ్చిమ భాగంలో తీవ్రమైన వర్షాలు, వరదలతో కనీసం ఎనిమిది మంది మరణించారు. 1999లో, కారకాస్‌కు ఉత్తరాన ఉన్న వర్గాస్ రాష్ట్రంలో భారీ కొండచరియలు విరిగిపడి దాదాపు 10,000 మంది మరణించారు.