
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓ బాలికకు డేటింగ్ అడ్వైజ్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే, అధ్యక్షుడి సలహాకు ఆ బాలిక ఒకింత ఇబ్బంది పడినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. కాలిఫోర్నియాలోని ఇర్విన్ వ్యాలీ కమ్యూనిటీ కాలేజీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి బైడెన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్యాంపస్లో విద్యార్థులతో సరదాగా ఫోటోలు దిగిన అధ్యక్షుడు.. తనముందు నిలుచున్న బాలికతో మాట్లాడుతూ 30 ఏళ్లు వచ్చేవరకు సీరియస్ రిలేషన్షిప్ లోకి వెళ్ళొద్దంటూ డేటింగ్ అడ్వైజ్ ఇచ్చాడు. తన కుమార్తెలు, మనవరాళ్లకు కూడా ఇదే సలహా ఇచ్చానని ఆయన పేర్కొన్నారు.
అయితే అధ్యక్షుడి సలహాకి ఆ బాలిక కాస్త అసౌకర్యానికి గురైనట్టు కనిపించింది. ‘ఓకే, నేను దీన్ని దృష్టిలో ఉంచుకుంటాను’ అంటూ సమాధానం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోను ఇప్పటికే 5.2 మిలియన్ల మంది వీక్షించారు. కాగా, దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. అధ్యక్షుడు సలహాతో ఆ బాలిక అసౌకర్యానికి గురైంది. ఆమెకు ఎలా స్పందించాలో తోచలేదు అంటూ కొందరు విమర్శించారు. అయితే, ఆ బాలిక ఇబ్బంది పడలేదని, అధ్యక్షుడు ఆప్యాయంగా భుజం మీద చేయివేస్తే ఆమె సంభ్రమాశ్చర్యాలకు లోనైందని బైడెన్ కు మద్దతుగా నిలుస్తున్నారు.