మొక్కకు ప్రధాని మోదీ పేరు

First Published Jun 2, 2018, 1:30 PM IST
Highlights

సింగపూర్ పర్యటనలో మోదీ
 

భారత ప్రధాని నరేంద్రమోదీకి అరుదైన గౌరవం దక్కింది.  ఓ అరుదైన మొక్కకి ఆయన పేరుతో నామకరణం చేశారు.  మోదీ ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా..  ఈరోజు అక్కడి నేషనల్‌ ఆర్కిడ్‌ గార్డెన్‌ను  సందర్శించారు. 

ఈ సందర్భంగా ఓ మొక్కకు ఆయన పేరు పెట్టారు. మోదీ పేరు మీదుగా అక్కడి ఓ మొక్కకు ‘డెన్‌డ్రోబ్రియం నరేంద్ర మోదీ’ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. 

మోదీ పేరు మీదుగా నామకరణం చేసిన ఈ మొక్క ఉష్ణమండలానికి సంబంధించిందని, ఇది 38సెంటీమీటర్ల పొడవు పెరుగుతుందని, దీనికి 14 నుంచి 20 దాకా చక్కని పుష్పాలు పూస్తాయని రవీశ్‌ పేర్కొన్నారు.

అనంతరం మోదీ సింగపూర్‌లోని ప్రాచీన హిందూ దేవాలయం శ్రీ మరియమ్మాన్‌ను సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి ఆయనకు శాలువా బహుకరించారు. మరియమ్మాన్‌ దేవతను పూజించేందుకు తమిళనాడులోని నాగపట్నం, కడలూరు జిల్లాలలకు చెందిన వలసదారులు ఈ ఆలయాన్ని 1827లో నిర్మించారు. 

ఇది చైనాటౌన్‌ ప్రాంతంలో ఉంది. అలాగే మోదీ చైనాటౌన్‌లోని హిందూ, బౌద్ధ ఆలయాలతో పాటు మసీదును కూడా సందర్శించారు. మసీదులో మోదీకి ఆకుపచ్చ రంగు శాలువా బహుకరించారు. దశాబ్దాలుగా భారత్‌, సింగపూర్‌ ప్రజల మధ్య సంబంధాలను తెలియజేస్తూ మోదీ దేవాలయాలు, మసీదు సందర్శించారని రవీశ్ కుమార్‌ వెల్లడించారు.

click me!