Omicron: అలాంటి సంకేతాలు ఏమి లేవు.. డేల్టా కంటే తీవ్రత తక్కువే.. గుడ్ న్యూస్ చెప్పిన డబ్ల్యూహెచ్‌వో

By Sumanth KanukulaFirst Published Dec 8, 2021, 9:05 AM IST
Highlights

కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలను కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) అధికారి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్.. ఇంతకు ముందు వచ్చిన వేరియంట్‌‌ల కంటే తీవ్రమైనది అని గానీ, ఇప్పటికే ఉన్న టీకాలు దీనిపై సమర్ధవంతంగా పనిచేయవు అనడానికి గానీ ఎటువంటి ఆధారాలు లేవని తెలిపారు.

కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలను కలిగిస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్.. సరిహద్దులు దాటి వేగంగా విస్తరిస్తుంది. పలు దేశాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడం ఆందోళనను మరింతగా పెంచుతుంది. అయితే ఇలాంటి క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) అధికారి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్.. ఇంతకు ముందు వచ్చిన వేరియంట్‌‌ల కంటే తీవ్రమైనది అని గానీ, ఇప్పటికే ఉన్న టీకాలు దీనిపై సమర్ధవంతంగా పనిచేయవు అనడానికి గానీ ఎటువంటి ఆధారాలు లేవని తెలిపారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఎమర్జెన్సీ‌స్ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  Omicron అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ..  ఇప్పటివరకు చూసిన డెల్టా, ఇతర వేరియంట్‌ల కంటే తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుందని సూచించడానికి ఎటువంటి ఆధారాలు లేవని అన్నారు. ప్రస్తుతం ఉన్న టీకాలు.. ఓమిక్రాన్‌ను సంక్రమించే వ్యక్తులను రక్షించగలవని భావిస్తున్నట్టుగా చెప్పారు.

Also read: Omicron: డెల్టా కంటే ప్రమాదకరం కాకపోవచ్చు.. అమెరికా ఆంక్షలు ఎత్తేస్తుంది.. టాప్ సైంటిస్టు ఫౌచీ 

‘మా వద్ద అత్యంత ప్రభావవంతమైన వ్యాక్సిన్‌లు ఉన్నాయి. అవి తీవ్రమైన వ్యాధి, ఆసుపత్రిలో చేరడం వంటివాటి పరంగా..  ఇప్పటివరకు వెలుగుచూసిన అన్ని వేరియంట్లపై ప్రభావవంతంగా నిరూపించబడ్డాయి. ఓమిక్రాన్‌కు వ్యతిరేకంగా పనిచేయవు అని చెప్పడానికి ఎటువంటి కారణం లేదు’ అని మైఖేల్ ర్యాన్ అన్నారు. ఏది ఏమైనప్పటికీ.. ఒమిక్రాన్ వేరియంట్‌ను పూర్తిగా అంచనా వేయడానికి మరింత పరిశోధన అవసరమని మైఖేల్ ర్యాన్ అన్నారు. 

US అంటు వ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ కూడా మంగళవారం రోజు ఇదే రకమైన విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వెలుగుచూసిన డెల్టాతో పాటు ఇతర వేరియంట్ల కంటే ఒమిక్రాన్ అధ్వాన్నంగా లేదని ఆయన అన్నారు. 

అయితే, ప్రాథ‌మిక విశ్లేష‌ణ‌లో వెలుగుచేసిన వివ‌రాల ప్ర‌కారం.. దీనిలో అధికంగా స్పైక్ మ్యుటేష‌న్లు ఉన్నాయి. దీని కార‌ణంగా ఇది డెల్టా వేరియంట్ కంటే అధికంగా వ్యాప్తి చెందుతుంద‌ని నిపుణుల అంచ‌నాలు పేర్కొంటున్నాయి.  దానికి త‌గ్గ‌ట్టుగానే ప‌లు దేశాల్లో ఒమిక్రాన్ కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్  మొద‌ట వెలుగుచూసిన  దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్‌ కేసులు భారీగా న‌మోద‌వుత‌న్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఇప్ప‌టివ‌ర‌కు  దక్షిణాఫ్రికా, సెనెగల్, బోట్స్‌వానా, మెక్సికో, భారత్‌, నెదర్లాండ్స్, హాంకాంగ్, ఇజ్రాయెల్, బెల్జియం, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఆస్ట్రియా, కెనడా, స్వీడన్, స్విట్జర్లాండ్, స్పెయిన్, పోర్చుగల్, జపాన్, ఫ్రాన్స్, ఘనా , దక్షిణ కొరియా, నైజీరియా, బ్రెజిల్, నార్వే, అమెరికా, సౌదీ అరేబియా, ఐర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, రష్యా, నమీబియా, నేపాల్, థాయిలాండ్, క్రొయేషియా, అర్జెంటీనా, శ్రీలంక, మలేషియాతో పాటు సింగపూర్ దేశాల్లో న‌మోద‌య్యాయి.

click me!