coronavirus: కరోనావైరస్ యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్నది. అనేక మ్యుటేషన్లకు లోనవుతూ అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. ప్రస్తుతం కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉంది. అయితే, ఇదివరకు పంజా విసిరిన డెల్టా వేరియంట్‌కు ఒమిక్రాన్ ఇమ్యూనిటీతో చెక్ పెట్టవచ్చునని దక్షిణాఫ్రికా నిపుణుల బృందం తమ అధ్యయనంలో వెల్లడించింది.
coronavirus: 2019లో చైనాలోని వూహాన్ నగరంలో వెలుగుచూసిన కారోనా వైరస్ అతి తక్కువ కాలంలోని యావత్ ప్రపంచాన్ని చుట్టుముట్టింది. అనేక మ్యుటేషన్లకు లోనవుతూ.. ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలోనే కరోనా వైరస్ డెల్టా వేరియంట్ అన్ని దేశాలపై పంజా విసరడంతో లక్షలాది మంది చనిపోయారు. కోట్లాది మంది అనారోగ్యానికి గురయ్యారు. భారత్ లో డెల్టా వేరియంట్ కల్లోలం రేపుతూ.. కరోనా వైరస్ సెకండ్ వేవ్ కు కారణమైంది. ఇప్పటికీ చాలా దేశాల్లో ఈ డెల్టా వేరియంట్ కేసులు వెలుగుచూస్తున్నాయి. అయితే, ప్రస్తుతం గత నెలలో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్నది. ఎందుకంటే ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నది. అలాగే, దీని ప్రభావం ఇప్పటివరకు ప్రమాదకర వేరియంట్లుగా భావించిన వాటి కంటే అధికంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డెల్టాతో పోలిస్తే వేగంగా వ్యాపించే సామర్థ్యం ఉండడంతోపాటు రోగనిరోధకతను ఏమార్చే గుణం ఉన్నట్లు నివేదికలు వస్తుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్న సమయంలో తాజాగా వచ్చిన ఓ అధ్యయనం కాస్త ఊరట కలిగిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ ఇమ్యూనిటీతో డెల్టాకు చెక్ పెట్టవచ్చునని దక్షిణాఫ్రికాకు చెందిన ఓ నిఫుణుల అధ్యయనం వెల్లడించింది.
Also Read: Assembly Election 2022: ఐదు రాష్ట్రాల ఎన్నికల వాయిదాకు అవకాశం లేదు !
undefined
ఇదివరకటి కరోనా వైరస్ వేరియంట్లను ఎదుర్కొనే రోగనిరోధకత కొత్త వేరియంట్ ఇన్‌ఫెక్షన్ల వల్ల కలుగుతున్నందున డెల్టా వేరియంట్ స్థానాన్ని ఒమిక్రాన్ భర్తీ చేయవచ్చని దక్షిణాఫ్రికా నిపుణుల తాజా అధ్యయనం అంచనా వేసింది. దక్షిణాఫ్రికా నిపుణుల బృందం అధ్యయనంలోని మరిన్ని వివరాలు ఇలా వున్నాయి... కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకిన వారిలో డెల్టాను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి మెరుగైన స్థాయిలో పెరుగుతున్నదని తమ అధ్యయనంలో గుర్తించామని నిపుణుల బృందం పేర్కొంది. ఒకవేళ ఇదే కొనసాగితే డెల్టాతో రీ-ఇనఫెక్షన్ బారినపడకుండా కాపాడడంతో పాటు తీవ్రవ్యాధి నుంచి రక్షణ కల్పించడంలో ఒమిక్రాన్ దోహదం చేస్తున్నట్లు ఈ అధ్యయనం అంచనా వేసింది. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన తర్వాత దీని వివరాలు తెలసుకోవడానికి చాలా దేశాల్లో పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా పరిశోధకులు సైతం ఒమిక్రాన్ పై అధ్యయనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒమిక్రాన్ సోకిన ఓ 33 మందిపై దక్షిణాఫ్రికా నిపుణులు అధ్యయనం చేపట్టారు. వ్యాక్సిన్ తీసుకున్న, తీసుకోని వారిని పరిగణనలోకి తమ అధ్యయనం కొనసాగించారు.
Also Read: Dengue: ఢిల్లీపై డెంగ్యూ పంజా.. 9500 కేసులు, 23 మరణాలు !
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకిన వారిలో డెల్టాను తటస్థీకరించే సామర్థ్యం పెరిగినట్లు గుర్తించారు. అంటే మరోసారి డెల్టా వేరియంట్ సోకే సామర్థ్యం తగ్గిపోతుందనే విషయం స్పష్టమైందని నిపుణులు పేర్కొన్నారు. అయితే, ఇది డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వ్యాధి తీవ్రత తక్కువగా ఉందా? లేదా అనే విషయంపై ఇది ఆధారపడి ఉంటుందని నిపుణులు స్పష్టం చేశారు. ఒకవేళ ఇదే నిజమైతే కరోనా వైరస్ తీవ్రత తగ్గే అవకాశాలు అధికంగా ఉంటాయని ఈ అధ్యనం పరిశోధకులు వెల్లడించారు. ఒమిక్రాన్ తక్కువ వ్యాధికారకమైనదే అయితే.. డెల్టాను పారద్రోలడంలో ఇది ఎంతగానో సహాయపడుతుందని ఆఫ్రికా ఆరోగ్య పరిశోధనా సంస్థలోని ప్రొఫెసర్ అలెక్స్ సిగాల్ వెల్లడించారు. ఇదిలావుండగా, ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 130కి పైగా దేశాలకు విస్తరించింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా, బ్రిటన్,అమెరికా, ప్రాన్స్ సహా పలు యూరప్ దేశాల్లో ఒమిక్రాన్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి.
Also Read: Brazil Floods: బ్రెజిల్ ను ముంచెత్తిన వరదలు.. ఎటుచూసినా వరద నీరే.. !