బూస్టర్ డోసుల కంటే కూడా ఒమిక్రాన్‌తో ఎక్కువ రోగ నిరోధక శక్తి.. యూఎస్ వర్సిటీ సంచలన అధ్యయనం

By Mahesh KFirst Published May 16, 2022, 2:09 PM IST
Highlights

బూస్టర్ షాట్ కంటే కూడా ఒమిక్రాన్ సోకితే వ్యాక్సినేటెడ్ ప్రజల్లో ఎక్కువ రోగ నిరోధక శక్తి కనిపించిందని ఓ అధ్యయనం తెలిపింది. కరోనా టీకా వేసుకుని బూస్టర్ డోసు తీసుకున్నవారి కంటే కూడా కరోనా టీకా వేసుకున్నాక ఒమిక్రాన్ వేరియంట్ సోకినవారిలో ఎక్కువ వ్యాధి నిరోధక శక్తి జనించిందని వివరించింది.
 

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఇంకా ప్రబలుతూనే ఉన్నది. ఎంతో మందికి సోకుతూనే ఉన్నది. ముఖ్యంగా చైనా, ఉత్తర కొరియా దేశాల్లో ఈ మహమ్మారి విలయం సృష్టిస్తున్నది. మన దేశంలోనూ కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే, మన దేశంలో హాస్పిటలైజేషన్ రేటు స్వల్పంగా ఉన్నది. రికవరీలు కూడా వేగంగా రిపోర్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ కొత్త అధ్యయనం సంచలన విషయాలు వెల్లడించింది. టీకా పొందిన వారిలో బూస్టర్ షాట్ కంటే కూడా ఒమిక్రాన్ సోకడం ద్వారా ఎక్కువ రోగ నిరోధక శక్తి జనిస్తున్నట్టు తెలిపింది. 

వ్యాక్సిన్ తయారీదారు బయోఎన్‌టెక్ ఎస్‌ఈ, వాషింగ్టన్ యూనివర్సిటీలు తమ అధ్యయనాల్లో కీలక విషయాలు తెలిపాయి. బూస్టర్ టీకాలు వేసుకున్నవారిలో రోగ నిరోధక శక్తి, టీకా వేసుకున్నాక ఒమిక్రాన్ వేరియంట్ సోకినవారిలో రోగ నిరోధక శక్తిలో గణనీయమైన తేడా ఉన్నట్టు తేలింది. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో ఎక్కువ రోగ నిరోధక శక్తి ఏర్పడుతున్నదని, ఆ శక్తి మిగతా అన్ని రకాల కరోనా వేరియంట్లను ఎదుర్కొనే శక్తిని కలిగి ఉన్నదని అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనం చూసి ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడాలని భావించరాదని ఈ అధ్యయనం చేసిన నిపుణులు వార్నింగ్ ఇచ్చారు.

ఈ స్టడీని రివ్యూ చేసిన పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన ఇమ్యునాలజీ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్, ప్రొఫెసర్ జాన్ వెర్రీ మాట్లాడారు. టీకాలు వేసుకున్న తర్వాత కరోనా సోకినట్టు అయితే, బూస్టర్ డోసు వేసుకోవడానికి ఇంకాస్త సమయం తీసుకోవాలని అన్నారు. ఎందుకంటే.. ఈ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్‌లు బూస్టర్ షాట్‌లాగే రోగనిరోధక శక్తిని ఉత్పత్తి చేస్తాయని వివరించారు.

అంతేకాదు, ఒమిక్రాన్ ఆధారంగా తయారు చేసిన బూస్టర్ షాట్ ఇస్తే మరిన్ని ఫలితాలు ఉంటయాని, ఒరిజినల్ వ్యాక్సిన్‌తోపాటు ఒకటికి మించి బూస్టర్ షాట్లు ఇవ్వడం కంటే ఒమిక్రాన్ ఆధార బూస్టర్ షాట్ ఇవ్వడం సముచితం అని పరిశోధకులు వివరించారు. ఒకరికి ఒకటికి మించి బూస్టర్ షాట్ ఇవ్వాల్సిన అవసరం లేని స్థితిలో మనం ఇప్పుడు ఉన్నట్టు వాషింగ్టన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డేవిడ్ వీస్లర్ వివరించారు.

కాగా, ఇది వరకూ ఒక్క డోసు టీకా కూడా వేసుకోనివారిలో ఒమిక్రాన్ సోకితే ఇలాంటి పరిస్థితి లేదని ఈ అధ్యయనం వెల్లడించింది. అందుకే ఇంకా టీకా తీసుకోకుండా ఉండటం ప్రమాదకరం అని తెలిపింది. ఒక వేళ ప్రమాదకరమైన కొత్త వేరియంట్ పరిణమిస్తే అప్పుడు దుష్పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.

click me!