
న్యూఢిల్లీ: ఉక్రెయిన్, రష్యా మధ్య సంధి కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ రాజీకి సిద్ధం అయినట్టు తెలుస్తున్నది. నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, అందుకే మిలిటరీ ఆపరేషన్ చేపడుతున్నట్టూ రష్యా చెప్పింది. ఇప్పుడు ఆ నాటో కూటమిలో చేరికపైనే ఉక్రెయిన్ కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు నిన్న ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ తాము నాటోలో చేరాలనే నిర్ణయాన్ని విరమించుకున్నట్టు తెలిపారు. తమను చేర్చుకోవాలని మోకరిల్లే దేశానికి నాయకత్వం వహించాలనుకోవడం లేదని పేర్కొన్నారు. నాటో కూటమి ఇలాంటి వివాదపూరిత విషయాలపై జంకుతున్నదని, రష్యాను తలపడటానికి తడబడుతున్నదని అన్నారు.
అంతేకాదు, రష్యా గుర్తించిన తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు ప్రాంతాలు ఎల్పీఆర్, డీపీఆర్‌లపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు ప్రాంతాలు ఉక్రెయిన్‌లో అంతర్భాగంగా ఉండేవి. కానీ, రష్యా మద్దతుతో కొందరు వేర్పాటువాదులు ఈ ప్రాంతాలకు స్వతంత్రను ప్రకటించుకున్నారు. దీన్ని ఉక్రెయిన్ తీవ్రంగా వ్యతిరేకించింది. తాజాగా యుద్ధం ప్రారంభించడానికి ముందు రష్యా ఈ రెండు ప్రాంతాలను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించింది. ఈ రెండు ప్రాంతాలపైనా తాము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. అక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఉక్రెయిన్‌లో చేరాలనే వారి పరిస్థితి ఏమిటి? ఆ రెండు ప్రాంతాలూ ఉక్రెయిన్‌లో ఉండాలనే దేశ ప్రజల ఆలోచనలు వంటి క్లిష్టమైన అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయని చెప్పారు. కాబట్టి, వాటిని సింపుల్‌గా గుర్తించడం పరిష్కారం కాదని, దానిపై రష్యాతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు.
కాగా, ఈ రోజు రష్యా కూడా సానుకూలంగా స్పందించింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న చర్చలు పురోగతి సాధిస్తున్నాయని తెలిపింది. తాము ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కూలదోయాలని భావించడం లేదని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిది మరియా జఖరొవా అన్నారు. ఉక్రెయిన్‌లోని ప్రస్తుత ప్రభుత్వాన్ని కూల్చాలని తాము తమ మిలిటరీ టార్గెట్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌తో మూడు రోజుల తమ చర్చలు ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌లో ఘర్షణపూరిత వాతావరణం నుంచి ప్రజల తరలింపు కోసం ఒక రోజు మొత్తం కాల్పుల విరమణ పాటించడానికి రష్యా, ఉక్రెయిన్ మధ్య అంగీకారం కుదిరింది. ఉక్రెయిన్‌లో బీభత్సాన్ని ఎదుర్కొంటున్న ఆరు ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కాల్పులను విరమించడానికి అంగీకరించిందని యూకే డిప్యూటీ ప్రధాని ఇరినా విరిష్చుక్ తెలిపారు.
ఈ పరిణామాలు చూస్తుంటే యుద్ధం అంతిమ దశకు చేరుకున్నట్టుగానే అనిపిస్తున్నది. రష్యా దాడులు మొదలుపెట్టినా ఉక్రెయిన్ అధ్యక్షుడు మాత్రం పశ్చిమ దేశాల అండతో ఎంతమాత్రం తలొగ్గలేదు. కానీ, నాటో మిలిటరీ కూటమి ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించకపోవడంతో ఆ కూటమిపై జెలెన్‌స్కీ భ్రమలు తొలిగిపోయినట్టుగా మాట్లాడారు. ఇప్పటికీ వెంటనే తమకు ఆయుధాలు అందించాలని పశ్చిమ దేశాలను కోరాడు. కానీ, అది జాప్యంగానే సాగుతున్నది. ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పోలాండ్ చేరుకుని ఫైటర్ జెట్లను ఉక్రెయిన్‌కు అందించడంపై చర్చిస్తున్నారు. దీనిపైనా జెలెన్‌స్కీ అసంతృప్తిగానే ఉన్నారు. తాము ఇప్పుడు యుద్ధంలో ఉన్నామని, వెంటనే తమకు ఫైటర్ జెట్లు అందించాలని, వాటి కోసం ఎదురుచూసే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే జెలెన్‌స్కీ పశ్చిమదేశాలతో వియ్యం.. రష్యాతో కయ్యం అనవసరం అని భావించి ఉండవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.