
న్యూఢిల్లీ: రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) వెనకడుగు వేయడం లేదు. ఉక్రెయిన్ (Ukraine)పై మొదలు పెట్టిన యుద్ధంపై పునరాలోచన లేదన్నట్టుగా ముందుకే పోతున్నాడు. ఉక్రెయిన్ పౌరులు, మిలిటరీ నుంచి ప్రతిఘటన వచ్చినా.. పశ్చిమ దేశాలు ఆర్థిక ఆంక్షలు (Financial Sanctions) విధించినా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేది లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. అంతేనా.. తమపై ఆర్థిక ఆంక్షలు విధించిన దేశాలకే రివర్స్‌లో వార్నింగ్ ఇస్తున్నారు. ఆర్థిక ఆంక్షలకు రష్యా ప్రతిచర్యలు చాలా వేగంగా ఉంటాయని రష్యా పశ్చిమ దేశాలను హెచ్చరించింది.
1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత కఠిన ఆర్థిక ఆంక్షలను నేడు రష్యా ఎదుర్కొంటున్నది. ఉక్రెయిన్‌పై దాడి మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు రష్యా దాదాపు మొత్తం రష్యా ఆర్థిక, కార్పొరేట్ వ్యవస్థలపై ఆంక్షలు ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలోనే రష్యా హెచ్చరించింది.
రష్యా విదేశాంగ శాఖకు చెందిన దిమిత్రీ బిరిచెవ్‌స్కీ ఆర్థిక ఆంక్షలపై స్పందిస్తూ.. రష్యా రియాక్షన్ చాలా వేగంగా ఉంటుందని అన్నారు. అది చాలా దీర్ఘాలోచనతో కూడి, సెన్సిటివ్‌గా ఉంటుందని హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం రష్యన్ చమురు దిగుమతులపై ఆంక్షలు విధించారు. రష్యన్ ఆయిల్, ఇతర ఎనర్జీ దిగుమతులపై వెంటనే నిషేధాన్ని ప్రకటించారు. ఉక్రెయిన్‌పై దురాక్రమణను టార్గెట్ చేస్తూ ఆయన ఈ ఆంక్షలు విధించారు. కాగా, ఈ చమురుపై ఆంక్షలకు సంబంధించి రష్యా ఇది వరకు హెచ్చరించింది.
యూరప్ దేశాలు సుమారు 500 మిలియన్ టన్నుల ఆయిల్‌ను ప్రతి యేటా వినియోగిస్తాయని రష్యా తెలిపింది. అందులో రష్యా సుమారు 30 శాతం యూరప్‌కు ఎగుమతి చేస్తున్నదని వివరించింది. అంటే సుమరాు 150 మిలియన్ టన్నుల ఆయిల్‌ను తాము ఎగుమతి చేస్తున్నామని పేర్కొంది. దానితోపాటు 80 మిలియన్ టన్ను పెట్రోకెమికల్స్ ఎగుమతి చేస్తున్నామని తెలిపింది. ఒక వేళ తమ ఆయిల్ దిగుమతులను అమెరికా, యూరోపియన్ యూనియన్ బ్యాన్ చేస్తే ఒక బ్యారెల్ ధర రూ. 300 అమెరికన్ డాలర్లకు పెరుగుతుందని స్పష్టం చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా.. కోకా-కోలా , పెప్సికో లపై ఒత్తిడి రావడంతో రష్యాలో వ్యాపారాన్ని నిలిపివేస్తున్నట్లు శీతల పానీయాలరంగంలో దిగ్గజాలైన కోకాకోలా, పెప్సికో ఇంతకుముందే ప్రకటించింది. ఇప్పుడు తాజాగా మెక్ డొనాల్డ్స్, స్టార్ బక్స్, జనరల్ ఎలక్ట్రిక్ కూడా ఇదే బాటలో తమ నిర్షయాన్ని ప్రకటించాయి. మెక్‌డొనాల్డ్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, కంపెనీ గత సంవత్సరం చివరి నాటికి రష్యాలో 847 రెస్టారెంట్‌లు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం నేరుగా కంపెనీనే నిర్వహిస్తుంది. అదనంగా, ఉక్రెయిన్‌లో 108 రెస్టారెంట్లు ఉన్నాయని కూడా పేర్కోంది. ఉక్రెయిన్ మీద రష్యా దాడిని నిరసిస్తూ... ఆపిల్, వీసాలాంటి ప్రముఖ కంపెనీల రష్యాలో కార్యకలాపాలను సస్పెండ్ చేశాయి.
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్దం13 వ రోజుకు చేరుకుంది. యుద్దం ప్రారంభించిన నాటి నుంచి రష్యన్ బలగాలు.. ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడుతున్నాయి. యుద్దాన్ని నిలిపివేయాలని ప్రపంచ దేశాలు రష్యాను కోరినా.. ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పైగా.. రష్యా రోజురోజుకు యుద్ద తీవ్రతను పెంచుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి.