russia ukraine war: చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్‌తో సంబంధాలు కట్ .. ఐఏఈఏ తీవ్ర ఆందోళన

Siva Kodati |  
Published : Mar 09, 2022, 03:43 PM IST
russia ukraine war: చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్‌తో సంబంధాలు కట్ .. ఐఏఈఏ తీవ్ర ఆందోళన

సారాంశం

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం అంతర్జాతీయ సమాజానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ భద్రత విషయంలో మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ).

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం (russia ukraine war) నేపథ్యంలో చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్ (Chernobyl nuclear power plant) మరోసారి వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌‌పై దాడి మొదలుపెట్టిన మర్నాడే చెర్నోబిల్‌‌ను స్వాధీనం చేసుకుంది రష్యా. అయితే దీని భద్రతపై అంతర్జాతీయ సమాజం ఆందోళన  వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో చెర్నోబిల్‌కు సంబంధించి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) (International Atomic Energy Agency ) కీలక విషయాలు వెల్లడించింది. చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సమాచార వ్యవస్థతో సంబంధాలు తెగిపోయాయని, దీంతో డేటాను వెల్లడించలేకపోతున్నామని ఐఏఈఏ మంగళవారం తెలిపింది. రష్యా సైనికుల అధీనంలో పనిచేస్తున్న అక్కడ సిబ్బంది పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. 200 మంది సాంకేతిక, భద్రత సిబ్బంది అక్కడ చిక్కుకుపోవడంతో.. ఈ నేపథ్యంలో ప్లాంట్‌లోని సిబ్బంది పరిస్థితి దయనీయంగా ఉందని ఐఏఈఏ ఆవేదన వ్యక్తం చేసింది. 

‘ఐఏఈఏ చీఫ్ రఫేల్ గ్రాస్సీ (Rafael Grossi) .. చోర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్ వద్ద ఏర్పాటుచేసిన భద్రతా పర్యవేక్షణ వ్యవస్థల నుంచి రిమోట్ డేటా ట్రాన్స్‌మిషన్ నిలిచిపోయినట్టు చెప్పారు. అయితే, ఉక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాల్లోని భద్రత పర్యవేక్షణ వ్యవస్థల స్థితిని పరిశీలిస్తోందని, త్వరలోనే తదుపరి సమాచారం అందజేస్తాం అని ఐఏఈఏ పేర్కొంది. అణు పదార్థాలు, కార్యకలాపాల దుర్వినియోగాన్ని ముందస్తుగా గుర్తించడం ద్వారా అణ్వాయుధాల వ్యాప్తిని నిరోధించే లక్ష్యంతో సాంకేతిక చర్యలను వివరించడానికి ‘సేఫ్‌గార్డ్స్’ అనే పదాన్ని ఐఏఈఏ ఉపయోగిస్తుంది. 

ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేసినా రియాక్టర్లు, రేడియోధార్మిక వ్యర్థ సౌకర్యాలను కలిగి ఉన్న జోన్ దాని లోపలే ఉంది. మరో అణు విపత్తును నివారించడానికి స్థిరమైన నిర్వహణ అవసరం కాబట్టి 2,000కు పైగా సిబ్బంది ఇప్పటికీ ప్లాంట్‌లో పనిచేస్తున్నారు. ప్లాంట్ భద్రత దృష్ట్యా కార్మికులకు విశ్రాంతి అవసరమని, వారికి సాధారణ షిఫ్ట్‌లు కల్పించాలని రష్యా ప్రభుత్వానికి ఐఏఈఏ సూచించింది. చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లోని సిబ్బంది ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితి.. అణు భద్రతకు ప్రమాదం గురించి తాను ఆందోళన చెందుతున్నానని గ్రాస్సీ చెప్పారు. రిమోట్ డేటా ట్రాన్స్‌మిషన్ నిలిపివేయడం, ఉక్రేనియన్ యంత్రాంగం ఇ-మెయిల్ ద్వారా మాత్రమే ప్లాంట్‌ను సంప్రదిస్తుండటంతో చెర్నోబిల్ భద్రతను పర్యవేక్షించడానికి అక్కడ పర్యటించాల్సి ఉందని గ్రాస్సీ స్పష్టం చేశారు. 

మరోవైపు, యూరప్‌లోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రమైన జపోరిజియాను రష్యా గతవారం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ప్లాంట్‌పై దాడుల నేపథ్యంలో మంటలు చెలరేగాయి. అయితే, అదృష్టవశాత్తూ రియాక్టర్‌లో పేలుడు సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కాగా.. ఉక్రెయిన్‌పై రష్యా 13 రోజులుగా దాడి చేస్తునే ఉంది.  యుద్దాన్ని నిలిపివేయాల‌ని ప్ర‌పంచ దేశాలు ర‌ష్యాను కోరినా.. ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. రోజురోజుకు ఉక్రెయిన్‌పై దాడులను తీవ్రం చేస్తుంది త‌ప్పా.. ప్ర‌పంచ‌దేశాల‌ ఆంక్షల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. మ‌రోవైపు.. పలు నగరాల్లో కాల్పుల విరమణ ప్రకటిస్తూనే.. నివాస గృహాల‌ను టార్గెట్ చేస్తూ.. భారీ బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఈ త‌రుణంలో ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)లో (nato) చేరడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ (volodymyr zelensky) మంగళవారం స్పందించారు. 

ఈ అంశంపై జెలెన్స్కీ మాట్లాడుతూ.. NATOలో  త‌మ దేశం చేర‌డాన్ని ఇత‌ర దేశాలు  ఇష్టపడటం లేద‌నీ, దీంతో నాటో కూటమిలో తాము చేరాలనుకోవడంలేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ప్రకటన చేశారు. తమపై దాడులకు తెగబడుతున్న రష్యాపై ఆ కూటమి పోరాడటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ర‌ష్యాను ఎదురించ‌డానికి అనేక దేశాలు  భ‌య‌ప‌డుతున్నాయ‌ని అన్నారు. తమ భూభాగంలోని ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా ప్రకటించిన రష్యా నిర్ణయంపై కూడా రాజీపడనున్నట్టు ప్రకటించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించడానికి ప్రధాన కారణాలు ఇవే కావడం గమనార్హం.   
 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే