పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ప్రతిపక్షం.. ఓటింగ్ ఎప్పుడంటే?

Published : Mar 28, 2022, 07:58 PM IST
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ప్రతిపక్షం.. ఓటింగ్ ఎప్పుడంటే?

సారాంశం

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై సోమవారం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని పీఎంఎల్-ఎన్ ప్రెసిడెంట్ షెహబాజ్ షరీఫ్ ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగానే సభను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేశారు. ఈ తీర్మానంపై ఓటింగ్‌కు కనీసం మూడు రోజులు లేదా ఏడు రోజుల్లోపు నిర్వహించనున్నారు.

న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ పదవీకి రోజులు దగ్గరపడ్డాయి. మరికొన్ని రోజుల్లో ఆయన ప్రధానిగా దిగిపోయే ముప్పు ఉన్నది. ఎందుకంటే.. ఈ రోజు పాకిస్తాన్ పార్లమెంటులో ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వానికి మద్దతు కరిగిపోయిందని, మిత్రపక్షాలే కాదు.. సొంత పార్టీ నేతలూ అసంతృప్తిగా ఉన్నారన్న కథనాల నేపథ్యంలో ఖాన్ మరెంతో కాలం ప్రధానిగా కొనసాగలేడని చర్చ జరుగుతున్నది.

పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షాలు సోమవారం ప్రవేశపెట్టాయి. దిగువ సభలో ఈ తీర్మానాన్ని పీఎంఎల్-ఎన్ ప్రెసిడెంట్ షెహబాజ్ షరీఫ్ ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మాన ప్రవేశానికి అనుమతి తీసుకునే తీర్మానాన్ని ముందు ప్రవేశపెట్టారు. దానికి 161 మంది నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆ తర్వాత ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగానే డిప్యూటీ స్పీకర్ ఖాసిం ఖాన్ సూరీ సభను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేశారు.

ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని నేషనల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గానీ, ఓటింగ్ ఇవాళ జరగలేదు. ప్రధానమంత్రిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత ఓటింగ్ కోసం కనీసం మూడు రోజుల ఎడం ఉండాలని స్పీకర్ ఇది వరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన సభను మూడు రోజుల తర్వాతకు వాయిదా వేశారు. ఓటింగ్‌ను కనీసం మూడు రోజుల తర్వాత లేదా ఏడు రోజుల లోపే నిర్వహించనున్నారు. అంటే ఈ అవిశ్వాస తీర్మానంపై 31వ తేదీన ఓటింగ్ జరగొచ్చు లేదా ఏడు రోజుల్లోపు ఎప్పుడైనా జరిగే అవకాశం ఉన్నది. దీంతో పాకిస్తాన్‌లో పొలిటికల్ టెంపరేచర్ పరాకాష్టకు చేరుతున్నది.

ఈ సభ మొత్తం బలం 342. ప్రధాని ఖాన్‌ను పదవి నుంచి దింపేయాలంటే ప్రతిపక్షాల వైపు నుంచి  కనీసం 172 ఓట్లు పడాలి. కచ్చితంగా 172 మంది చట్టసభ్యులు ఖాన్‌కు వ్యతిరేకంగా ఓటేస్తారని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. కాగా, ఖాన్ సారథ్యంలోని పీటీఐ సభ్యులు 155 మంది ఉన్నారు. ఇతర మిత్రపక్షాల మద్దతుతో తాము ఈ అవిశ్వాస పరీక్షపై గెలిచి తీరుతామని ప్రభుత్వపక్షం వాదిస్తున్నది. కానీ, పీటీఐ మిత్రపక్షాలూ ఆయనకు దూరంగా జరిగినట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు, సొంత పార్టీ నుంచే ఆయనపై తిరుగుబాటు చేసి పార్టీకి అందుబాటులో లేకుండా పోయారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం ఆసక్తి రేపుతున్నది.

దేశ రాజకీయాలు ఈ నెల 8వ తేదీ నుంచి తీవ్రత పెంచుకున్నాయి. ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా అదే రోజు ప్రతిపక్షాలు స్పీకర్‌కు విజ్ఞప్తి సమర్పించాయి. దేశంలో ద్రవ్యోల్బణం నియంత్రణ కోల్పోవడం, ధరలు పతనం కావడానికి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వమే కారణం అని ఆరోపించాయి. 14 రోజుల్లో సెషన్ నిర్వహించాలనీ అవి కోరాయి. దీంతో మూడు రోజుల తప్పనిసరి నిబంధనతో ఈ నెల 25వ తేదీన స్పీకర్ నేషనల్ అసెంబ్లీ సెషన్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్న తరుణంలో ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ వైదొలుగుతారా? రాజీనామా చేస్తారా? అనే చర్చ జరిగింది. కానీ, తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఖాన్ తేల్చేశారు. ఇది ఒక వైపు జరుగుతుండగా ఆదివారం ఇస్లామాబాద్‌లో ఆయన ఓ భారీ ర్యాలీలో ప్రసంగించారు. తనను గద్దె దించడానికి విదేశీ శక్తుల కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే