
న్యూఢిల్లీ: ఉత్తర అమెరికా దేశం, యూఎస్ పొరుగు దేశమైన మెక్సికోలో ఒక్కసారిగా కాల్పుల బీభత్సం జరిగింది. అక్రమ మానవ రవాణా, డ్రగ్స్ ముఠాల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా కాల్పులు జరుపుకున్నారు. రక్తపుటేరులను పారించారు. ఈ కాల్పుల్లో చాలా మంది గాయపడ్డారు. 19 మంది మరణించారు. వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ ఘటన సెంట్రల్ మెక్సికోలో సోమవారం చోటుచేసుకుంది. మెక్సికో కాలమాణం ప్రకారం ఆదివారం రాత్రి 10.30 గంటల (04.30 జీఎంటీ)కు ముందే చోటుచేసుకున్నాయి. అంటే.. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 10 గంటలకు ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందింది.
మెక్సికోలోని మికావోకాన్ రాష్ట్రంలోని లాస్ టినాజాస్ పట్టణంలో ఓ వేడుక జరిగిందని తెలిసింది. ఇక్కడే కాల్పులు జరిగాయని సమాచారం. అధికారులు ఆ ఘటనా స్థలికి చేరే సరికి 19 ప్రాణం లేని దేహాలు చెల్లచెదురుగా పడి ఉన్నాయని స్టేట్ అటార్నీ జనరల్ ఆఫీస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ 19 మందిలో 16 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్టు తెలిపింది. ఇంకా చాలా మంది కాల్పులతో తీవ్రంగా గాయపడి ఉన్నారు. వారిని హాస్పిటల్‌కు తరలించినట్టు అధికారులు వివరించారు. అయితే, ఈ కాల్పులు ఎందుకు జరిగి ఉంటాయన్న ప్రశ్నకు అధికారులు వివరణలు ఇవ్వలేదు.
మెక్సికోలో మికావోకాన్, దాని పొరుగు రాష్ట్రం గువానాజువాటోల్లో విపరీతమైన హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మానవ అక్రమ రవాణా, డ్రగ్స్ ముఠాల మధ్య గ్యాంగ్ వార్లు ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ గ్యాంగ్‌ల ఏరియాలపై పట్టు కోసం ప్రధానంగా ఇక్కడ తరుచూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఈ ముఠాలు డ్రగ్స్ అక్రమ రవాణాతోపాటు దొంగిలించిన చమురునూ పంపించే అక్రమ కార్యకలాపాలు చేస్తున్నాయి.
2006లో ప్రభుత్వం ఫెడరల్ ట్రూప్‌లతో వివాదాస్పద యాంటీ డ్రగ్ ఆపరేషన్ చేపట్టినప్పటి నుంచి మెక్సికోలో తరుచూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అప్పటి నుంచి ఈ ఘటనల్లో 3.40 లక్షల హత్యలు జరిగాయి. ఈ హత్యలకు నేరస్తుల మధ్య ఘర్షణలే కారణంగా ఉన్నాయి.
అమెరికా సంయుక్త రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్న మెక్సికో దేశంలో నిత్యం హింస పెచ్చరిల్లుతూనే ఉన్నది. అమెరికా డ్రీమ్ కంట్రీ కావడంతో చాలా మంది అక్రమ మార్గాల్లో మెక్సికో ద్వారా అమెరికా పంపే పనులను పంపే ముఠాలు ఇక్కడ ఉన్నాయి. వీటితోపాటు చాలా రకాల అక్రమ కార్యకలాపాలను ఇవి వెలుగబెడుతున్నాయి. ఇందులోనూ తమ ప్రాంతం, తమ పరిధిని పెంచుకోవడానికి, ఎదుటి వర్గాన్ని హెచ్చరించడానికి తరుచూ ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.