
తాలిబన్ల (talibans) చేతుల్లోకి ఆఫ్ఘనిస్థాన్ (afghanistan) వెళ్లిపోయాక అక్కడ అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. ప్రజలకు క్షమాభిక్ష పెట్టామని.. ఎవరు దేశం విడిచి వెళ్లాల్సిన పని లేదని చెప్పిన తాలిబన్లు ఆ హామీని తుంగలో తొక్కారు. ఈ క్రమంలోనే బహిరంగంగా శిక్షలు వేస్తూ తాలిబన్లు అకృత్యాలకు పాల్పడుతున్నారు. అయితే, తాజాగా బహిరంగ శిక్షలపై (public executions) తాలిబన్లు ప్రకటన చేశారు. దేశ సుప్రీంకోర్టు (supreme court) ఆదేశాలు వచ్చే వరకు బహిరంగ శిక్షలను అమలు చేయబోమని స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు వస్తేనే బహిరంగ మరణ శిక్షలు, బహిరంగ ఉరితీతలను అమలు చేయాలని తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ (zabihullah mujahid) చెప్పారు. అందుకు మంత్రిమండలి (afghanistan cabinet) ఆమోదం తెలిపిందని వెల్లడించారు. శిక్ష విధిస్తే తప్పనిసరిగా అతడు చేసిన నేరమేంటో ప్రజలకు తెలిసేలా చేయాలని చెప్పారు. అయితే, కాళ్లూచేతుల నరికివేత, ఉరితీత వంటి కఠినమైన శిక్షలను బహిరంగంగా అమలు చేస్తామని గతంలో ఆఫ్ఘనిస్థాన్ న్యాయ శాఖ మంత్రి ముల్లా నూరుద్దీన్ తురాబీ (mullah nooruddin turabi) వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అమెరికా (america) దానిపై ఆందోళన వ్యక్తం చేసినా.. తాము ఎలాంటి శిక్షలు వేయాలో వేరే దేశాలు చెప్పాల్సిన పని లేదంటూ నూరుద్దీన్ మండిపడ్డారు.
కాగా, సెప్టెంబర్ 25న హెరాత్ సిటీలో వ్యాపారిని కిడ్నాప్ చేసిన నలుగురికి తాలిబన్లు మరణశిక్ష విధించారు. వ్యాపారిని కిడ్నాప్ చేసిన నలుగురిని కాల్చి చంపారు. అనంతరం మృతదేహాలను సిటీ జంక్షన్‌లో క్రేన్లతో వేలాడదీశారు. కాళ్లు, చేతులు నరకడం వంటి శిక్షలు అమల్లో వుంటాయని తాలిబన్లు వెల్లడించారు.
ALso Read:ఆఫ్గన్‌లో బహిరంగ శిక్షల అమలు: వ్యాపారి కిడ్నాప్ చేసిన వారిని కాల్చివేత, క్రేన్లకు మృతదేహాల వేలాడదీత
గతంలో 1996 నుంచి 2001 మధ్య ఆప్ఘనిస్తాన్ ను పాలించిన తాలిబన్లు అప్పట్లో క్రూరులుగా పేరు తెచ్చుకున్నారు. ఆప్ఘన్ గడ్డపై షరియా చట్టాలకు వ్యతిరేకంగా జరిగే అన్ని రకాల కార్యకలాపాలను అడ్డుకోవడమే కాకుండా దీనికి బాధ్యులైన ప్రతీ ఒక్కరికీ కఠినమైన శిక్షలు విధించే వారు. ఇందులో చేతుల నరికివేతతో పాటు ఉరిశిక్షలు కూడా ఉండేవి. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విమర్శలు వచ్చినా తాలిబన్లు ఎప్పుడూ పట్టించుకున్న పాపాన పోలేదు. మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నా ప్రపంచ దేశాలు జోక్యం చేసుకోలేని పరిస్ధితి అప్పట్లో ఉండేది. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటులో మహిళలకు స్ధానం కల్పిస్తామని చెప్పిన మాటలు నీటిమూటలయ్యాయి. అంతే కాదు దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన యధేచ్చగా సాగిపోతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న తిరుగుబాటుదారుల్ని అణచివేసే పనిలో తాలిబన్ ఫైటర్లు బిజీగా ఉన్నారు.