రాముడు పుట్టింది ఆ అయోధ్యలో కాదు.. మా అయోధ్యపురిలో: నేపాల్ ప్రధాని వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Aug 9, 2020, 7:05 PM IST
Highlights

భారత్‌పై ఇటీవలి కాలంలో ఒంటికాలిపై లేస్తున్న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి మరోసారి రెచ్చిపోయారు. శ్రీరాముడి జన్మస్థలం దక్షిణ నేపాల్‌లోని అయోధ్యాపురి అని, యూపీలోని అయోధ్య కాదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు

భారత్‌పై ఇటీవలి కాలంలో ఒంటికాలిపై లేస్తున్న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి మరోసారి రెచ్చిపోయారు. శ్రీరాముడి జన్మస్థలం దక్షిణ నేపాల్‌లోని అయోధ్యాపురి అని, యూపీలోని అయోధ్య కాదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

నెల రోజుల వ్యవధిలో అయోధ్యపై కేపీ శర్మ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది రెండోసారి. ఆదివారం మాడి మేయర్ ఠాకూర్ ప్రసాద్ ధఖాల్ నేతృత్వంలో తనను కలిసిన ప్రతినిధి బృందంతో రాముడి జన్మస్థలాన్ని అభివృద్ధి చేసేందుకు తన ప్రణాళికలను పంచుకున్నారు.

అయోధ్యపురిని శ్రీరాముడు జన్మించిన ప్రాంతంగా ప్రచారం చేయాలని, అక్కడ రాముడి విగ్రహం ప్రతిష్టాంచాలని ప్రధాని కోరారు. మాడి మున్సిపాలిటీ పేరును అయోధ్యపురిగా మార్చాలని ఆయన సూచించారు.

కాగా, నేపాల్ ప్రధాని ఓలి గత నెలలోనూ ఇవే వ్యాఖ్యలు చేయగా అధికార నేపాల్ కమ్యూనిస్ట పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే నేపాల్ ప్రధాని భారత వ్యతిరేక వ్యాఖ్యలను ఆయన పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు.

రాముడి జన్మస్థలంపై ఓలి ప్రచారాన్ని జానకి ఆలయ పూజారులు సహా నేపాల్‌కు చెందిన మత పెద్దలు ఖండిస్తున్నారు. అయోధ్య భూమిపూజలో పాల్గొన్న నేపాల్ మత బోధకుడు ఆచార్య దుర్గప్రసాద్ గౌతమ్ తమ దేశ ప్రధాని ఓలి వ్యాఖ్యలను తోసిపుచ్చారు.

మరోవైపు నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలో కేపీ ఓలికి వ్యతిరేకంగా అంతర్గత పోరు తీవ్రతరమైంది. పార్టీ అగ్రనేత పుష్ప కమల్ దహల్‌తో పాటు మాజీ ప్రధానులు మాధవ్ నేపాల్, జల్‌నాథ్ ఖనల్‌లు ఓలి తక్షణమే పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ప్రతిష్టాత్మక రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోడీ ఆగస్టు 5న శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. 

click me!