చరిత్రలో తొలిసారి.. సూర్యుడిని తాకిన‌ నాసా అంతరిక్ష నౌక.. మూడేళ్ల తర్వాత..

By Sumanth KanukulaFirst Published Dec 15, 2021, 2:43 PM IST
Highlights

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA)  ఖ‌గోళ చ‌రిత్ర‌లో సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. చరిత్రలో తొలిసారిగా ఓ అంతరిక్ష నౌక సూర్యుడిని తాకింది. నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ (Parker Solar Probe) అంతరిక్ష నౌక.. సూర్యుని ఉపరితల వాతావరణంలోకి ప్రవేశించింది. 

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA)  ఖ‌గోళ చ‌రిత్ర‌లో సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. చరిత్రలో తొలిసారిగా ఓ అంతరిక్ష నౌక సూర్యుడిని తాకింది. నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ (Parker Solar Probe) అంతరిక్ష నౌక.. సూర్యుని ఉపరితల వాతావరణంలోకి ప్రవేశించింది. ఇది.. coronaగా పిలవబడే ఆ వాతావరణంలోని కణాల, అయస్కాంత క్షేత్రాల శాంపిల్స్‌ను సేకరించింది. ఈ మేరకు నాసా ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసింది. ‘మా పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడిని తాకింది! ఓ అంతరిక్ష నౌక చరిత్రలో తొలిసారిగా సూర్యుడి వాతావరణం కరోనా గుండా  ప్రయాణించింది’ పేర్కొంది.

పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడిని తాకడం.. సౌర శాస్త్రంలో (solar science) పెద్ద మైలురాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడిపై ల్యాండింగ్ మాదిరిగానే ఇది కూడా అసాధారణమైనదని.. దీని ద్వారా సౌర వ్యవస్థపై సూర్యుని ప్రభావం గురించి, ముఖ్యమైన సమాచారం పొందడానికి వీలవుతుందని భావిస్తున్నారు. పార్క‌ర్ సోలార్ ప్రోబ్ మెషీన్ సూర్యుడిని తాక‌డం ఓ అసాధార‌ణ ఘ‌ట‌న అని మిష‌న్ డైర‌క్ట‌ర్ థామ‌స్ జుర్‌బుచెన్ తెలిపారు.

సూర్యుడి నుంచి వెలుబ‌డే సౌర త‌రంగాల‌పై పార్క‌ర్ ప్రోబ్ మ‌రింత లోతుగా అధ్య‌య‌నం చేయనున్న‌ది. సూర్యుడి ఉప‌రిత‌లం క‌రోనాలో భ్ర‌మిస్తున్న పార్క‌ర్ ప్రోబ్ వ‌ల్ల మునుముందు మ‌రిన్ని విష‌యాలు తెలిసే అవ‌కాశం ఉందని ప్రాజెక్టు సైంటిస్టు నౌరు రౌఫీ తెలిపారు. సౌర తుపానులు.. రేడియో కమ్యూనికేషన్లకు, శాటిలైట్లకూ అంతరాయం కలిగిస్తాయి. వీటిని ముందుగానే గుర్తించడానికి కూడా పార్కర్ సోలార్ ప్రోబ్ పంపే సమాచారం ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 

2018లో ప్రారంభించబడిన పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుని రహస్యాలను అన్వేషించడానికి ఉద్దేశించబడింది. ఇది ఇంతకు ముందు ఉన్న అంతరిక్ష నౌకల కంటే సూర్యునికి దగ్గరగా ప్రయాణించింది. ప్రయోగించిన మూడు సంవత్సరాల తర్వాత పార్కర్ ఎట్టకేలకు సూర్యుని వద్దకు చేరుకుంది. 

click me!