నా బిడ్డ హమాస్ ఉగ్రవాదుల చేతిలో చనిపోయింది. కానీ, ఆమె దారుణమైన చిత్ర వధ నుంచి తప్పించుకోగలిగింది అని జర్మనీకి చెందిన షాని లౌక్ తల్లి రికార్డా పేర్కొంది. ఆమె డెడ్ బాడీని కూడా అందిస్తే సక్రమంగా అంతిమ క్రియలు నిర్వహించుకోగలుగుతానని ఆమె వివరించింది.
కొన్నాళ్లుగా షాని లౌక్ హత్యోదంతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. జర్మనీకి చెందిన యువతి, టాట్టూ ఆర్టిస్ట్ ఇజ్రాయెల్‌లో నిర్వహించిన ఓ మ్యూజిక్ ఫెస్టివల్‌కు హాజరైంది. అక్టోబర్ 7వ తేదన హమాస్ ఉగ్రవాదుల దాడికి ఆమె బాధితురాలైంది. ఆమెను కిడ్నాప్ చేసి గాజాకు తీసుకెళ్లారు. అక్కడ ఆమెను నగ్నంగా ఊరేగించారు. తల నరికి హతమార్చారు. ఇటీవలే ఆమె తల భాగానికి చెందిన ఎముకలు ఇజ్రాయెల్ సైన్యానికి దొరికాయి. డీఎన్ఏ టెస్టు చేయగా.. అది జర్మనీ టాట్టూ ఆర్టిస్ట్ షాని లౌక్‌దేనని తేలింది.
షాని లౌక్ కనిపించకుండా పోయినప్పటి నుంచి ఆమె తల్లి రికార్డా లౌక్ సోషల్ మీడియాలో ఆవేదనభరిత వీడియోలు పోస్టు చేసింది. తన బిడ్డ గురించిన సమాచారం తెలిస్తే తనకు చెప్పాలని ప్రాధేయపడింది. అనంతరం, షాని హమాస్ హాస్పిటల్‌లో ప్రాణాలతో ఉన్నట్టు గాజా స్ట్రిప్‌లోని కొందరు మిత్రులు తెలిపినట్టు ఓ వీడియోలో పేర్కొంది. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రభుత్వం షాని మరణించినట్టు ప్రకటించింది.
Also Read : ఐ బ్రోస్ షేప్ చేయించుకున్నందుకు విడాకులు.. దుబాయ్ నుంచి ఫోన్‌లోనే త్రిపుల్ తలాఖ్
తాజాగా, షాని తల్లి రికార్డా ఓ వీడియోలో తన బిడ్డ అనేక చిత్రవధల నుంచి తప్పించుకున్నదని తెలుసుకుని కొంత ఊరటపొందానని వివరించింది. ఆమె ఇప్పుడు అక్టోబర్ 7న కిబ్బుట్జ్ రీఇమ్ సమీపంలో నిర్వహించిన మ్యూజిక్ ఫెస్టివల్‌లపై హమాస్ జరిపిన మారణహోమానికి ఒక ప్రతీకగా మారిందని తెలిపింది. జర్మన్ బ్రాడ్‌కాస్టర్ ఆర్టీఎల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తల్లి మాట్లాడుతూ.. కనీసం ఆమె చిత్రవధ నుంచి తప్పించుకోగలిగింది అని నిట్టూర్పు విడిచింది. తన బిడ్డ డెడ్ బాడీని గుర్తించి తనకు పంపిస్తే ఆమె సరైన పద్ధతిలో అంతిమ సంస్కారాలు చేస్తానని పేర్కొంది.
షాని లైక్ మృతదేహాన్ని ఓ పికప్ వ్యాన్ వెనుక వేసుకుని ఊరేగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె అప్పటికే మరణించినట్టు చెబుతున్నారు. ఆమె మరణించాక హమాస్ ఉగ్రవాదులు అత్యాచారం చేశారని, నగ్నంగా ఊరేగించారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతున్నది.