
Trump-Musk fight: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రముఖ వ్యాపారి ఎలాన్ మస్క్ మధ్య మాటలయుద్దం తారాస్థాయికి చేరుకుంది. తాజాగా అమెరికా అధ్యక్షుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు మస్క్. జెఫ్రీ ఎప్స్టీన్ బాలల లైంగిక వేధింపుల కేసులో ట్రంప్‌కి సంబంధం ఉందని, అందుకే కేసు రిపోర్ట్‌ని ట్రంప్ రహస్యంగా ఉంచారని మస్క్ ఆరోపించారు.
“బిగ్ బాంబ్, ఈ పోస్ట్ గుర్తుపెట్టుకోండి, నిజం బయటపడుతుంది” అంటూ మస్క్ ఎక్స్ లో ఓ ట్వీట్ చేశారు. ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న మస్క్, ట్రంప్ ఇటీవల కాలంలో శత్రువులుగా మారారు. ట్రంప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం ద్వారా మస్క్ అధ్యక్షుడితో గొడవ ఏ స్థాయిలో సాగుతుందో అర్ధం చేసుకోవచ్చు.
2019లో జైలులో ఆత్మహత్య చేసుకున్న అమెరికన్ బిలియనీర్ జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక వేధింపుల కేసులో ట్రంప్ ప్రమేయం ఉందని మస్క్ కామెంట్ చేసారు. ఈ ఆరోపణలపై ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి.
మస్క్‌తో తనకు మంచి సంబంధాలు ఉంటాయని అనుకోవడం లేదని ట్రంప్ అన్నారు. ఎలాన్ మస్క్ కంపెనీలకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు ఆపేయాలని ట్రంప్ ఆదేశించారు. ఎలాన్ మస్క్ కంపెనీలకు ప్రభుత్వ సబ్సిడీలు, పన్ను రాయితీల ద్వారా 38 బిలియన్ డాలర్లు లభించాయి. వీటిని ఆపేస్తానని ట్రంప్ బెదిరించారు.
మస్క్‌తో తనకున్న మంచి సంబంధాలు ఇకపై కొనసాగుతాయో లేదో తెలియదని.. మస్క్ తనని నిరాశపరిచారని.. అందుకే వైట్ హౌస్ నుండి వెళ్లిపోవాలని చెప్పానని ట్రంప్ అన్నారు. అయితే తన సహాయం లేకుంటే 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయేవారని మస్క్ అన్నారు.