జాబ్ ప్రమోషన్ కోసం రికమెండ్ చేయలేదని బాస్ కుటుంబాన్ని హతమార్చిన ఉద్యోగి.. 8 ఏళ్ల తర్వాత అరెస్టు

By Mahesh KFirst Published Sep 21, 2022, 8:34 PM IST
Highlights

అమెరికాలో ఓ ఉద్యోగి తన బాస్ కుటుంబాన్ని మొత్తం హతమార్చాడు. తన ప్రమోషన్ కోసం రికమెండ్ చేయనందుకే ఈ దుస్సహానికి పాల్పడ్డాడు. తాజాగా, ఎనిమిదేళ్ల తర్వాత కటకటాల వెనక్కి వెళ్లాడు.
 

న్యూఢిల్లీ: అమెరికాలో దారుణం జరిగింది. ఓ ఉద్యోగి తన బాస్‌ను, బాస్ కుటుంబాన్ని మొత్తం హతమార్చాడు. జాబ్ ప్రమోషన్ కోసం రికమెండ్ చేయలేదని తన బాస్ కుటుంబాన్ని మొత్తం చంపేశాడు. ఈ ఘటన ఎనిమిదేళ్ల క్రితం అమెరికాలోని హూస్టన్‌లో 2014 జనవరి 30న చోటుచేసుకుంది.

చైనాకు చెందిన 58 ఏళ్ల ఫాంగ్ లూ ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే కంపెనీలో 50 ఏళ్ల మాయె సన్ ఆయనకు బాస్‌గా ఉన్నాడు. తనను రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెక్షన్‌కు పంపించాలని బాస్‌ను కోరాడు. ఈ మేరకు తన నైపుణ్యాలు చెబుతూ రికమెండ్ చేయాలని బాస్ మాయె సన్‌ను కోరాడు.

ఓ రోజు ఆయన ఆఫీసుకు వెళ్లగానే తోటి ఉద్యోగులు ఫాంగ్ లూతో అదోలా వ్యవహరించసాగారు. దీంతో ఆ రోజు జరిగిన సమావేశంలో తన బాస్ మాయె తన గురించి ఏదో అసభ్యకరంగా చెప్పి ఉంటాడని అనుమానించాడు. ఈ కారణంగా తనకు ప్రమోషన్ కూడా రాదని నిర్దారించుకున్నాడు. ఈ ఆగ్రహంతోనే ఫాంగ్ లూ తన బాస్ మాయె పై కక్ష గట్టాడు.

బాస్ ఇంటికి వెళ్లి మాయె సన్ సహా. 49 ఏళ్ల మిక్సి సన్, 9 ఏళ్ల తిమోతి సన్, 7 ఏళ్ల తితుస్ సన్‌లను హతమార్చాడు. వారంతా వేర్వేరు బెడ్ రూమ్‌లలో బుల్లెట్ గాయాలతో విగత జీవులుగా పడి ఉన్నారు.

ఫాంగ్ లూ తన గన్ గురించి చెప్పిన వేర్వేరు సమాధానాలు పోలీసుల్లో అనుమానాలను రేకెత్తించాయి. చివరకు ఆయనే హంతకుడని గుర్తించారు.

తన బాస్ తనకు ప్రమోషన్ కోసం రికమెండ్ చేయనందుకు ఆగ్రహంతోనే ఉన్నానని, కానీ, వారి హత్యలో తన ప్రమేయం ఏమీ లేదని ఫాంగ్ చెప్పాడు. అయితే, ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ అసలు విషయాన్ని బయటపెట్టగలిగింది. సన్ ఫ్యామిలీ ఇంటి నుంచి పోలీసులు కోచ్ పర్స్ రికవరీ చేసుకున్నారు. దీని ఆధారంగా డీఎన్ఏ అనాలిసిస్ చేశారు. ఈ శాంపిల్స్ ఫాంగ్‌తో మ్యాచ్ అయ్యాయి. కానీ, అప్పటికే ఫాంగ్ లూ తన స్వదేశం చైనా వెళ్లిపోయాడు. ఇక ఆయనను అరెస్టు చేయడం కుదరకపోవచ్చని పోలీసులు భావించారు. కానీ, అనూహ్యంగా ఆయన మళ్లీ అమెరికాకు తిరిగివచ్చాడు. కాలిఫోర్నియా ఎయిర్‌పోర్టులో ఫాంగ్ లూ దిగగానే పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. హత్య చేసిన ఎనిమిదేళ్ల తర్వాత ఫాంగ్ లూ కటకటాల వెనక్కి వెళ్లాడు.

click me!