దట్టమైన పొగమంచు కారణంగా భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 158 వాహనాలు ఈ ప్రమాదంలో డ్యామేజ్ అయ్యాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు.
దట్టమైన పొగమంచు కారణంగా భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 158 వాహనాలు ఈ ప్రమాదంలో డ్యామేజ్ అయ్యాయి. చాలా వరకు వాహనాలు ఒకదానిపైకి ఒకటి ఎక్కి కనిపించాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా.. 25 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన అమెరికాలోని దక్షిణ లూసియానాలో చోటుచేసుకుంది. వాహనాలు ఢీకొన్న కొంత భాగంలో మంటలు చెలరేగడంతో.. కొన్ని వాహనాలు అగ్నికి ధ్వంసం అయ్యాయి. దట్టమైన పొగమంచు, స్థానిక చిత్తడి నేలల మంటల నుండి వచ్చే పొగ కలిసి చాలా తక్కువ దృశ్యమానతకు దారితీసిన సూపర్ ఫాగ్ ఏర్పడిందని అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన అధికారులు.. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నట్టుగా స్థానిక మీడియా తెలిపింది.
గవర్నర్ జాన్ బెల్ ఎడ్వర్డ్స్ ఈ ఘటనపై స్పందించారు. ఒక ప్రకటన విడుదల జాన్ బెల్ ఎడ్వర్డ్స్.. ఈ ప్రమాదంలో మరణాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారిని ఆదుకోవడానికి రక్తదానం చేయాలని ప్రజలను కోరారు.