
ఖార్కివ్‌ను వెంటనే ఖాళీ చేయాలని అక్కడి భారతీయులను ఆదేశించింది ఉక్రెయిన్‌లోని భారతీయ విదేశాంగ శాఖ (ministry of external affairs ) . వెంటనే ఖార్కివ్‌ను వదిలి వెంటనే సరిహద్దులను చేరుకోవాలని హెచ్చరించింది. స్థానిక కాలమాన ప్రకారం.. సాయంత్రం 6 గంటలలోపు ఖార్కివ్ నుంచి వచ్చేయాలని ఆదేశించింది. కాగా.. బుధవారం ఏడో రోజుకు చేరిన ఈ యుద్ధంలో ఖార్కివ్ (Kharkiv) నగరంపై బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఈ రోజు 21 మంది మరణించారు. కాగా, సుమారు 100 మంది గాయాలపాలయ్యారు.
ఇదిలా ఉండగా, ఖార్కివ్‌లోని ఓ మెటర్నిటీ కేంద్రంపై వైమానిక దాడులు చేయడం బాధాకరంగా మారింది. ఖార్కివ్‌లోని జైటోమిర్‌లోని మెటర్నిటీ హోంపై బాంబులు వేసింది. ఈ దాడిలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఉక్రెయిన్‌లో కీవ్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్ ఈ రోజు బాంబులతో దద్దరిల్లిపోతున్నది. నికోలేవ్ ఏరియా మొత్తం బాంబుల కారణంగా ఏర్పడ్డ పొగదుప్పటితో కప్పుకుపోయింది. ఖెర్సాన్ సిటీ మొత్తంగా రష్యా ఆర్మీ అధీనంలోకి వెళ్లినట్టు తెలిసింది. దీన్ని స్థానిక అధికారులు ధ్రువీకరించలేదు. కానీ, రష్యా ఆర్మీ మాత్రం ఖెర్సాన్ సిటీని తాము స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు.
రష్యా దాడులు ఏడో రోజుకు చేరడంతో వాట్సాప్‌లో హెల్ప్‌లైన్ నెంబర్‌ను ప్రవేశపెట్టింది. ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులను, ముఖ్య మైన సమాచారం, సలహాలను ప్రజలకు ఈ హెల్ప్‌లైన్ ద్వారా చేరవేయనుంది. నిన్న రష్యా మొత్తం ఖార్కివ్‌పైనే ఫోకస్ పెట్టింది. షెల్లింగ్ దాడులతో విరుచుకుపడింది. ఈ రోజు ఏకంగా రష్యా పారాట్రూపులు ఈ నగరంలో కాలుమోపాయి. రష్యా వైమానిక దళ సిబ్బంది ఖార్కివ్ నగరంలో దిగిందని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. వారు దిగీదిగగానే స్థానిక హాస్పిటల్‌ను ధ్వంసం చేశారని వివరించింది. ఇక్కడ యుద్ధం ఇంకా కొనసాగుతున్నదని పేర్కొంది.
అయితే ఉక్రెయిన్ (ukraine) యుద్ధాన్ని రోజుల్లోనే ముగించాలనుకున్న రష్యాకు (russia) అది అంత తేలిక కాదనే విషయం త్వరగానే అర్ధమైంది. ఇప్పటికీ ఉక్రెయిన్‌లోని కీలక నగరాలను ఆక్రమించుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలో రష్యాకు కాస్త ఉపశమనం లభించింది. దక్షిణ ఉక్రెయిన్ లోని ఖేర్సన్ నగరంపై ఆ దేశపు సైన్యం పూర్తిగా పట్టు సాధించింది. నగరంలో ఎక్కడ చూసినా రష్యా సాయుధ వాహనాలే కనిపిస్తున్నాయి. గత కొన్నిరోజులుగా ఉక్రెయిన్ నగరాల దిశగా రష్యా అదనపు బలగాలను తరలిస్తోంది.
అటు, రాజధాని కీవ్ పైనా రష్యా బలగాలు బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఇక్కడి భారీ టీవీ టవర్ ను రష్యా సైన్యం పేల్చివేసింది. దాంతో కీవ్ లో టెలివిజన్ ప్రసారాలు నిలిచిపోయాయి. ఇక.. నిన్న క్షిపణి దాడులతో దద్దరిల్లిన ఖార్కివ్ లోనూ పరిస్థితి ఏమీ మారలేదు. బుధవారం కూడా ఖార్కివ్ నగరంలో పోలీసు కార్యాలయంపై రష్యా సేనలు దాడులు చేశాయి. ఖార్కివ్ నగరంలోనే నిన్న జరిగిన క్షిపణి దాడిలో కర్ణాటకకు చెందిన భారతీయ విద్యార్థి నవీన్ సహా 21 మంది మరణించగా.. 100 మందికి పైగా క్షతగాత్రులయ్యారు.