ఉక్రెయిన్‌లో భార‌తీయ విద్యార్థి మృతిపై విచారణ జరుపుతాం.. రష్యా రాయబారి

Published : Mar 02, 2022, 05:09 PM IST
ఉక్రెయిన్‌లో భార‌తీయ విద్యార్థి మృతిపై విచారణ జరుపుతాం.. రష్యా రాయబారి

సారాంశం

ఉక్రెయిన్-రష్యాల మధ్య జరుగుతున్న భీకర దాడిలో భారత విద్యార్థి నవీన్ శేకరప్ప గ్యానగౌడర్ (Naveen Shekharappa) మృతిచెందిన సంగతి తెలిసిందే. భారతీయ విద్యార్థి మృతిపై రష్యా విచారణ చేపడుతుందని డెనిస్ అలిపోవ్ తెలిపారు.

ఉక్రెయిన్-రష్యాల మధ్య జరుగుతున్న భీకర దాడిలో భారత విద్యార్థి నవీన్ శేకరప్ప గ్యానగౌడర్ (Naveen Shekharappa) మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తూర్పు ఉక్రెయిన్‌లోని ఖర్కివ్‌లో నగరంలో చోటుచేసుకుంది. అయితే భారత విద్యార్థి మృతిపట్ల భారత్‌లో రష్యా రాయబారిగా ఉన్న డెనిస్ అలిపోవ్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవీన్ కుటుంబానికి, భారతదేశానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వివాద ప్రాంతాల్లో భారతీయుల క్షేమం కోసం రష్యా చేయగలిగినదంతా చేస్తుందని చెప్పారు. ఖార్కివ్‌లో భారతీయ విద్యార్థి మృతిపై రష్యా విచారణ చేపడుతుందని డెనిస్ అలిపోవ్ తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. తూర్పు ఉక్రెయిన్‌లోని ఘర్షణ ప్రాంతాలలో చిక్కుకున్న భారతీయ పౌరులను సురక్షితంగా తరలించేందుకు రష్యా మానవతా కారిడార్‌లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తోందని తెలిపారు. తర్పూ ఉక్రెయిన్ ప్రాంతాలలో చిక్కుకున్న భారతీయులను రష్యన్ భూభాగానికి అత్యవసర తరలింపు కోసం భారతదేశం అభ్యర్థనలను రష్యా స్వీకరించిందని తెలిపారు. భారతీయులను తరలించే ప్రక్రియలో భాగంగా.. మానవతా కారిడార్‌లను తెరవడానికి అధికారులు చురుకుగా పనిచేస్తున్నారని అలిపోవ్ చెప్పారు.

ఇక, ఖర్కివ్‌లో నవీన్‌ మృతితో.. ఆ ప్రాంతంలో ఉంటున్న భారతీయ విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. దీంతో భారత ప్రభుత్వం తూర్పు ఉక్రెయిన్‌లోని ఖార్కివ్, సుమీతో పాటు ఇతర ఘర్షణ ప్రాంతాలలో చిక్కుకున్న సుమారు 4,000 మంది భారతీయుల తరలింపును అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంది. ఈ మేరకు రష్యాతో భారత్ సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు ఉక్రెయిన్ పశ్చిమ సరిహద్దు దేశాలైన రొమేనియా, హంగేరి, పోలాండ్, స్లోవేకియాకు చేరుకుంటున్న భారతీయ విద్యార్థుల తరలింపును కూడా భారత ప్రభుత్వం వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. 

నవీన్ ఖర్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. అయితే రష్యా దాడుల నేపథ్యంలో ఖర్కివ్‌లోని ఓ బంకర్‌లో ఉండిపోయిన నవీన్.. మంగళవారం సరుకులు కొనుగోలు  చేయడానికి బయటకు వచ్చిన సమయంలో జరిగిన షెల్లింగ్‌లో మృతిచెందాడు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ నవీన్ కుటుంబానికి తెలియజేసింది.వైద్య విద్యను అభ్యసించడానికి ఉక్రెయిన్ వెళ్లిన నవీన్ మృతిచెందాడనే విషయం తెలియగానే అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన భారతీయులను తీవ్రంగా కలిచివేసింది. పార్టీలకు అతీతంగా పలువురు రాజకీయ నాయకులు నవీన్ కుటుంబానికి తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ.. నవీన్ తండ్రితో మాట్లాడారు. వారి కుటుంబానికి తన సంతాపాన్ని తెలియజేశారు. 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే