
న్యూఢిల్లీ: రష్యా (Russia) రోజుకో షాకింగ్ న్యూస్ ఇస్తున్నది. ఇప్పటికే న్యూక్లియర్ (Nuclear) డిటరెంట్ ఫోర్సెస్‌ను హై అలర్ట్‌లో ఉండమని చెప్పినట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఆదేశించినట్టు వెల్లడించడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. దీనికి తోడు ఇవాళ రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్ మరో బాంబు వేశారు. ఆయన ఏకంగా మూడో ప్రపంచ యుద్ధం (Third World War) గురించి మాట్లాడారు. ఒక వేళ మూడో ప్రపంచ యుద్ధం జరిగితే.. అందులో న్యూక్లియర్ వినియోగం ఉంటుందని, విధ్వంసం తప్పదని పేర్కొన్నారు. ఉక్రెయిన్ నాటోలో చేరితే అణ్వాయుధాలు తమ దేశ సరిహద్దులోకి వస్తాయని తెలిపారు. ఒక వేళ కీవ్ అణ్వాయుధాలు పొందితే అసలైన ముప్పు ఏర్పడుతుందని వివరించారు. కాబట్టి, ఉక్రెయిన్ అణ్వాయుధాలు పొందటాన్ని రష్యా అనుమతించబోదని స్పష్టం చేశారు.
ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపడితే ఆర్థిక ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తమకు తెలుసు అని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్ తెలిపారు. అందుకు రష్యా సిద్ధమయ్యే ఉన్నదని పేర్కొన్నారు. కానీ, పశ్చిమ దేశాలు తమ క్రీడాకారులు, పాత్రికేయులు, తమ సాంస్కృతిక ప్రతినిధులపైనా ఆంక్షలు వేస్తారని ఊహించలేదని ఆక్రోశించారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రారంభించి వారం అవుతున్నది. ఇప్పటికే భారీగా ఆర్మీని ఉక్రెయిన్‌లోకి పంపింది. బుధవారం ఉక్రెయిన్‌లోని ఖెర్సాన్ నగరాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నట్టు ఆర్మీ ప్రకటించింది. కాగా, రాజధాని కీవ్ నగరం వెలుపల సుమారు 40 మైళ్ల మేరకు ఆర్మీ కాన్వాయ్ ఉన్నదని శాటిలైట్ చిత్రాలు వెల్లడించాయి. యుద్ధం మొదలైన ఆరు రోజుల్లో రష్యాకు చెందిన ఆరు వేల మంది జవాన్లు మరణించారని ఉక్రెయిన్ తెలిపింది.
ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ .. ఉక్రెయిన్‌కు తన మద్దుతను బలపరిచారు. అమెరికా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన బైడెన్.. ఉక్రెయిన్ సంక్షోభంపై మాట్లాడారు. రష్యా భీకర దాడులు చేస్తున్న ఉక్రెయిన్ ప్రజలు మనో ధైర్యంతో పోరాడుతున్నారని ప్రశంసించారు. అయితే రష్యాపై ఉక్రెయిన్ పోరాటంలో అమెరికా సేనల ప్రమేయం ఉండదని.. అయితే నాటో సభ్యదేశాల భూభాగాల జోలికి వస్తే మిత్రదేశాలతో కలిసి వాటిని కాపాడుకుంటామని చెప్పారు. పుతిన్ యుద్దభూమిలో లాభాలు సాధించవచ్చని.. కానీ దీర్ఘకాలంలో తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
‘యుఎస్, మా మిత్రదేశాలు.. పూర్తి సామూహిక శక్తితో నాటో భూభాగంలోని ప్రతి అంగుళాన్ని రక్షించుకుంటాయి. ఉక్రెయిన్ ప్రజులు చాలా ధైర్యంగా పోరాడుతున్నారు. పుతిన్ యుద్దభూమిలో ప్రస్తుతానికి విజయం సాధించవచ్చేమో.. కానీ దీర్ఘకాలంలో అతను మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అమెరికా దళాలు ఉక్రెయిన్ కోసం పోరాడటం లేదు. కానీ మా నాటో మిత్ర దేశాలను రక్షించడానికి.. పుతిన్ పశ్చిమ దేశాలకు వెళ్లకుండా నిరోధించడానికి సిద్దంగా ఉంటాయి. పోలాండ్, రొమేనియా, లాట్వియా, లిథువేనియా, ఎస్టోనియాతో సహా నాటో దేశాలను రక్షించడానికి మేము అమెరికన్ గ్రౌండ్ ఫోర్స్‌లు, ఎయిర్ స్క్వాడ్రన్‌లు, నౌకలను సమీకరించాం’ అని బైడెన్ తెలిపారు. అమెరికా ప్రజలు, తాము ఉక్రెయిన్ ప్రజలతో ఉంటామని బైడెన్ అన్నారు.