
North Korea: ఉత్తర కొరియా పేదరికం, ఆకలితో అల్లాడిపోతున్నది. దీనితో దానికి కొత్త సంక్షోభం ఆత్మహత్య(Suicides)ల రూపంలో ఎదురువస్తున్నది. అక్కడ ఆత్మహత్యలు గణనీయంగా పెరిగాయి. చాలా చోట్ల కుటుంబాలకు కుటుంబాలే మొత్తంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆందోళనలో పడ్డారు. వెంట వెంటనే అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆత్మహత్యలను రాజద్రోహంగా పేర్కొన్నారు. ఎవరూ ఆత్మహత్య చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయిలోని అధికారుల వరకూ అందరికీ ఆదేశాలు పంపించారు.
రేడియో ఫ్రీ ఏషియాతో కొందరు ఉత్తర కొరియా ప్రభుత్వ అధికారులు మాట్లాడారు. అయితే, వారు వారి పేర్లు చెప్పడానికి నిరాకరించారు. మే నెలలో గతేడాదితో పోల్చితే ఆత్మహత్య 40 శాతం పెరిగినట్టు దక్షిణ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ వెల్లడించింది.
ఈ ఆత్మహత్యలను అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. సోషలిజానికి వ్యతిరేకంగా రాజద్రోహంగా పేర్కొన్నారు. ఈ ఆత్మహత్యలకు స్థానిక ప్రభుత్వ అధికారులు ఇందుకు బాధ్యులుగా తీసుకుంటామని వివరించారు. వారి వారి పరిధిలో జరిగే ఆత్మహత్యలకు స్థానిక ప్రభుత్వ అధికారులదే బాధ్యత అని పేర్కొన్నారు.
అత్యవసర సమావేశాల్లో ఆత్మహత్య నివారణ గురించి మాట్లాడారని ఓ అధికారి తెలిపారు. ప్రొవిన్షియల్, సిటీ, కౌంటీ స్థాయిల్లో పార్టీ అత్యవసర సమావేశాలు నిర్వహించింది. ఆత్మహత్య సంఖ్యను పరిశీలించి సమావేశాలకు హాజరైన అధికారులు సైతం విస్తూపోయారని రేడియో ఫ్రీ ఏషియా పేర్కొంది.
Also Read: ఉక్రెయిన్ కంపెనీ నుంచి జో బైడెన్‌కు 5 మిలియన్ డాలర్ల లంచం: అమెరికా మీడియాలో సంచలన కథనం
ఆత్మహత్యలు అక్కడి ప్రజలను బలంగా ప్రభావితం చేస్తున్నదని, ఆకలి కంటే కూడా దీని ప్రభావమే ఎక్కువ ఉన్నదని ర్యాంగాంగ్ ప్రావిన్స్ అధికారి ఒకరు పేర్కొన్నారు. అయితే, చాలా వరకు ఆత్మహత్యలు ఆకలి, పేదరికం వల్లే జరుగుతున్నాయని సమాచారం.