ఏ లక్షణం లేకపోయినా చిన్నపిల్లల్లో కరోనా వైరస్ వస్తుందన్నారు. ఇలాంటి కేసుల సంఖ్య ఈ మధ్య బాగా పెరుగుతోందంటున్నారు బ్రిటన్ వైద్యులు.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రెండున్నర లక్షల మందికి పైగా ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. జలుబు, జ్వరం, గొంతు నొప్పి లాంటి లక్షణాలు కనపడితే చాలు కరోనా వైరస్ సోకిందేమో అని ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
ఈ లక్షణాలనే ఇప్పటి వరకు కరోనా లక్షణాలుగా గుర్తించారు. అయితే.. వీటిని మించి పిల్లల్లో కొత్తగా కరోనా లక్షణాలు కనపడుతుండటం గమనార్హం. ఏ లక్షణం లేకపోయినా చిన్నపిల్లల్లో కరోనా వైరస్ వస్తుందన్నారు. ఇలాంటి కేసుల సంఖ్య ఈ మధ్య బాగా పెరుగుతోందంటున్నారు బ్రిటన్ వైద్యులు.
ఈ మేరకు ఇంగ్లండ్‌లోని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ సొసైటీ ఓ ప్రకటన విడుదల చేసింది.. గత మూడు వారాల్లో యూకేలోని పలు ప్రాంతాలతోపాటు లండన్‌లో చిన్నపిల్లల ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని పేర్కొంది. ఇందులో చాలామందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కానీ వారికి కరోనా లక్షణాలు కాకుండా ఇతరత్రా లక్షణాలు కనిపిస్తున్నాయని హెచ్చరించింది.
ని గురించి బ్రిటీష్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (బీఏపీఐవో) అధ్యక్షుడు డా. రమేశ్ మెహతా మాట్లాడుతూ.. మిగతావారితో పోలిస్తే పిల్లల్లో వైరస్ లక్షణాలు భిన్నంగా ఉన్నాయన్నారు. వీరి నమూనాలను కోవిడ్-19 రోగుల నమూనాలతో పోల్చి చూడగా ఇంచుమించు ఒకే విధంగా ఉంటున్నాయని పేర్కొన్నారు.
కానీ ఇది కరోనా లేక ఇతర వ్యాధి అయివుండచ్చా అనేది కచ్చితంగా నిర్ధారించలేకపోతున్నామని చెప్పారు. తొలుత ఇలాంటి కేసులు 25 నుంచి 30 మాత్రమే ఉండేవని, ఇటీవలి కాలంలో ఇవి బాగా పెరిగిపోయాయని వెల్లడించారు.
మరో ముఖ్య విషయమేంటంటే.. ఇది బ్రిటన్‌లో మాత్రమే కాదని, బెంగళూరు, కోల్‌కతా, ముంబై నగరాల్లోనూ ఇలాంటి కేసులు వెలుగు చూస్తున్నాయని పేర్కొన్నారు. ఈ తరహా కేసుల్లో పిల్లలు ఆకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి లోనవుతున్నారని, కడుపు నొప్పితో పాటు కొన్నిసార్లు గుండె సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతున్నాయని తెలిపారు. ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.