
న్యూఢిల్లీ: దశాబ్దాలుగా బాంబు పేలుళ్లు బుల్లెట్ల మోతలతో బిక్కుబిక్కు మంటూ అఫ్ఘనిస్తాన్ (Afghanistan)లోనే ఉండిపోయారు. అఫ్ఘనిస్తాన్‌లో నాటోకు సేవలు అందించడంతో సహజంగానే తాలిబాన్లకు శత్రువులయ్యారు. అక్కడ తాలిబాన్లు (Taliban) విజయం వైపు ప్రయాణిస్తుండగా.. వారి కుటుంబం మాత్రం విషాదంలో కూరుకుపోవడం మొదలైంది. అమెరికా సేనల (America Army) ఉపసంహరణ ప్రకటించగానే దేశాన్ని వదిలి శరణార్థులు (Refugees) విదేశాలకు వెళ్లడం మినహా మరో అవకాశం వారికి లేకుండాపోయింది. అమెరికా సైన్యం అఫ్ఘనిస్తాన్‌ను ఉపసంహరించడానికి ముందే ఆ కుటుంబం ఉక్రెయిన్ (Ukraine) కు వలస వెళ్లింది. కానీ, అక్కడా వారు స్థిరంగా ఉండే అవకాశం లేకపోయింది. రష్యా దాడులు (Russia Attack) చేయడంతో మళ్లీ వారు ఇంకో దేశానికి బాటపట్టారు.
40 ఏళ్ల అజ్మల్ రహ్మానీ ఆఫ్ఘనిస్తాన్ నివాసి. ఆయనకు ఒక పాప, ఒక బాబు. కుటుంబంతో ఆయన తన స్వదేశం ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నప్పుడు కాబూల్ ఎయిర్‌పోర్టులో నాటో కోసం 18 ఏళ్లు పని చేశాడు. అప్పుడు నాటోకు పని చేయడం ప్రమాదంతో సావాసం చేసినట్టే. నాటోకు సేవలు అందించేవారిని తాలిబాన్లు ఎప్పుడూ టార్గెట్ చేస్తూ ఏరిపారేసేవారు. అయినప్పటికీ అజ్మల్ రహ్మానీ నాటోకు సేవలందించే ఉద్యోగం చేశాడు. మంచి జీతం. జీవితం సాఫీగా సాగింది. సొంత ఇల్లు నిర్మించుకున్నాడు. ఒక కారు కొనుక్కున్నాడు. కానీ, తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతకు ముందే ఆయన దేశం వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. ఆయన సొంతిల్లు, కారు అమ్ముకుని కుటుంబంతో ఉక్రెయిన్‌కు వెళ్లాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆయనను స్వీకరించే ఏకైక దేశంగా ఉక్రెయిన్ మాత్రమే ఉండింది. దీంతో ఆయన ఉక్రెయిన్‌కు వెళ్లాడు.
వారి ప్రయాణం ఒక యుద్ధం నుంచి మరో యుద్ధం వరకు అన్నట్టుగా మారింది. వారు ఉక్రెయిన్ వెళ్లి సుమారు ఏడాది గడిచింది. అంతే.. ఇక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పశ్చిమ దేశాలు, అమెరికాలు ఒకవైపు రష్యా మరోవైపు కాలు దువ్వాయి. అందుకు వేదిక ఉక్రెయిన్ అయింది. అనుకున్నంత పని జరిగింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రకటించింది. దాడులు ప్రారంభించింది. దీంతో అందరూ ఉన్నపళంగా పొరుగు దేశాల సరిహద్దుకు పరుగుపెట్టారు.
అజ్మల్ రహ్మనీ కుటుంబం కూడా 1100 కిలో మీటర్లు ప్రయాణం చేసి పోలాండ్ సరిహద్దు వైపుకు వెళ్లారు. అక్కడి నుంచి సుమారు 30 కిలో మీటర్ల కాలి నడకన వెళ్లారు. ఇప్పుడు వారు పోలాండ్ దేశంలోకి ఎంటర్ అయ్యారు. అక్కడే సరిహద్దు దగ్గరే ఉన్నారు. వారిని సమీప నగరానికి తీసుకెళ్లే బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. వారితో పాటు వేలాది మంది ఉక్రెయిన్ నుంచి పోలాండ్‌కు వచ్చారు.
ఉక్రెయిన్‌లో రష్యా ‘సైనిక చర్య’ ప్రారంభం కాగానే, ఆ దేశం నుంచి పోలాండ్, హంగేరీ, రొమేనియాలకు ప్రజలు శరణార్థులుగా వెళ్లిపోతున్నారు. ఇందులో ఉక్రెయిన్ పౌరలే కాదు.. అఫ్ఘనిస్తాన్, నేపాల్, ఇండియాల పౌరులు, విద్యార్థులు, శరణార్థులు వెళ్లిపోతున్నారు. ఇప్పటి వరకు పోలాండ్‌కు ఉక్రెయిన్ నుంచి 2.13 లక్షల మంది శరణార్థులుగా వెళ్లినట్టు తెలిసింది.