అమెరికా అధ్యక్ష ఎన్నికలు: ట్రంప్‌ ఆశలు గల్లంతు... జో బైడెన్ ఘన విజయం

By Siva KodatiFirst Published Nov 7, 2020, 10:11 PM IST
Highlights

గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్ ఘన విజయం సాధించారు. .

గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్ ఘన విజయం సాధించారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా ఆయన త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. 284 ఎలక్టోరల్ ఓట్లతో బైడెన్ విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 213 ఓట్ల వద్దే నిలిచిపోయారు.

అన్ని ప్రాంతాలు, మతాలకు అతీతంగా రికార్డు స్థాయిలో అమెరికన్లు మార్పును కోరుకుంటున్నారని ఫలితాల్లో స్పష్టంగా తెలుస్తోంది. కరోనా వైరస్ కట్టడికి తొలి రోజు నుంచే ప్రణాళికలను అమలు చేస్తానని జో బైడెన్ ఇప్పటికే ప్రకటించారు.

అయితే మొన్నటి వరకు ఓటింగ్ ముగిసే వరకు వేచి చూడాలని మద్ధతు దారులకు పిలుపునిచ్చిన బైడెన్.. ఎన్ని లక్షల ఓట్ల తేడాతో గెలుస్తాననో కూడా చెప్పుకున్నారు. చూడబోతే ట్రంప్‌లోని కొన్ని లక్షణాలు బైడెన్‌లోనూ ఉన్నట్లుగా కనిపిస్తోంది.

అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ గెలవాలని చాలా మంది భారతీయులు కోరుకున్నారు. దీనికి ప్రధాన కారణం ట్రంప్ వీసా రూల్స్‌ను కఠినతరం చేయడమే. దీనికి తోడు కమలా హారిస్ ఉపాధ్యక్ష బరిలో నిలవడం కూడా ఇండియన్స్‌ను బైడెన్ వైపు మొగ్గేలా చేసింది.

బైడెన్ కూడా తాను అధికారంలోకి వచ్చాకా.. పాత అమెరికాను తెస్తానని, వీసా రూల్స్‌ని సరళతరం చేస్తానని చెప్పారు. అంటే ఇది నిజంగా జరుగుతుందా అంటే ప్రశ్నార్ధకమనే చెప్పాలి.

ట్రంప్ అమెరికన్లకు ఉద్యోగాలిస్తానంటే.. బైడెన్ ఇండియన్లకు ఉద్యోగాలు ఇస్తున్నారనే భావన కలగడం డెమొక్రాట్లకు అంత మంచి విషయం కాదు. దీనిని బట్టి బైడెన్.. చెప్పినంత తేలిగ్గా వీసా రూల్స్ మార్చబోరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

click me!