బైడెన్‌కు తిలకం దిద్దుతున్న తెలంగాణ పూజారి, ఫోటో వైరల్

By Siva KodatiFirst Published Nov 7, 2020, 4:20 PM IST
Highlights

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగుతున్నాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. 

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగుతున్నాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ పూజారి బైడెన్ నుదుటన తిలకం దిద్దుతున్న ఫోటో ఒకటి కలకలం రేపుతోంది. ఆ పూజారి ఎవరు అనే దానిని తెలుసుకోవడానికి గూగుల్‌ను జల్లెడ పడుతున్నారు.

ఆయన పేరు చంద్రశేఖర శర్మ... జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన వారు. శృంగేరీ, ఢిల్లీ వంటి పలు ప్రదేశాల్లో వేద అధ్యయనం చేశారు చంద్రశేఖర్. ఆ తర్వాత తెలిసినవారి ద్వారా అమెరికాకు ప్రయాణమయ్యారు.

కానీ.. చంద్రశేఖర్ కు వీసా లభించలేదు. ఆ సమయంలో శేఖర్ ను అమెరికాకు తీసుకురావడం కోసం డెలవర్ రాష్ట్రంలోని విల్మింగ్టన్ పట్టణంలోని మహాలక్ష్మి ఆలయం వాళ్ల ప్రోత్సాహంతో పాటు.. బైడెన్ సహాయం చేశారు. చంద్రశేఖర్ శర్మ వీసాకు అడ్డంకులను తొలగించేందుకు కృషి చేశారు.

ప్రస్తుతం చంద్రశేఖర్ శర్మ అమెరికాలోని శానిఫ్లాన్సిస్కో నగరంలోని డబ్లిన్ లో మరో నలుగురు పూజారులతో కలిసి.. తానే స్వయంగా పంచముఖ హనుమాన్ ఆలయాన్ని స్థాపించి స్వామి కైంకర్యాలతో ఆ నగరంలో హైందవ ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్నారు.

అయితే సనాతన ధర్మం పట్ల జో బైడెన్ కు అపారమైన గౌరవముందని.. డెలవర్ రాష్ట్రంలోని విల్మింగ్టన్ మహాలక్ష్మి ఆలయంలో ఆయనకు స్వయానా తన చేత తిలకం దిద్దడంతో పాటు.. కుంభాభిషేకం చేయడం వంటివి ఓ మధురానుభూతంటున్నారు చంద్రశేఖర్ శర్మ.

బైడెన్ హిందూ ధర్మాన్ని గౌరవించేవారని.. మహాలక్ష్మి ఆలయానికి వచ్చినప్పుడు అక్కడున్న విగ్రహాల గురించి క్షుణ్ణంగా తెలుసుకునేవారని చెబుతున్నారు శర్మ.

చంద్రశేఖర్ శర్మకి సహాయం చేయడంతో ధర్మపురి లక్ష్మీనర్సింహా స్వామికి నిత్యం బైడెన్ పేరిట పూజలు చేస్తున్నారట. అంతేకాదు.. బైడెన్ డెలెవర్ రాష్ట్రంలో ఉన్న మహాలక్ష్మీ దేవాలయానికి ప్రత్యేకంగా వస్తుంటారని ఆయన చెబుతున్నారు. హిందూ ఆచార సంప్రదాయలపై బైడెన్ కి అమితమైన ఆసక్తి ఉండటం గర్వంగా ఉందంటున్నారు స్థానికులు.
 

click me!