కశ్మీర్‌లో ఉగ్రవాదానికి సహకరించండి? తాలిబాన్లను కలిసిన జైషే మొహమ్మద్ సంస్థ చీఫ్

By telugu teamFirst Published Aug 27, 2021, 7:22 PM IST
Highlights

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలో ఉన్నప్పుడు 1999లో భారత విమానాన్ని హైజాక్ చేసి కాందహార్‌కు తీసుకెళ్లి ప్రయాణికులకు బదులుగా మన దేశం నుంచి జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను ఉగ్రవాదులు విడిపించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలోకి రాగానే మసూద్ అజర్ కాందహార్ చేరుకుని అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారు. కశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని ప్రేరేపించడానికి సహకరించాల్సిందిగా కోరుతున్నట్టు సమాచారం.
 

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్లు అధీనంలోకి తెచ్చుకున్న తర్వాత జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజర్ ఆ దేశానికి వెళ్లాడు. ఈ నెల మూడో వారంలోనే కాందహార్‌ చేరుకున్నారు. జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించడానికి సహకరించాల్సిందిగా కోరడానికి ఆయన తాలిబాన్‌కు వెళ్లినట్టు కొన్నివర్గాలు తెలిపాయి. ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ సహా పలువురు కీలక తాలిబాన్ నేతలను మసూద్ అజర్ కలిసినట్టు తెలిసింది. కశ్మీర్ లోయలో విధ్వంసం సృష్టించడానికి తోడ్పడాల్సిందిగా కోరినట్టు సమాచారం.

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల విజయాన్ని జైషే మొహమ్మద్ పండుగ చేసుకుంది. అమెరికా మద్దతుగల ప్రభుత్వం ఇక కూలిపోయిందని మసూద్ అజర్ ఇటీవలే పేర్కొన్నారు. లక్ష్యం వైపుగా అనే శీర్షికతో ఆయన తాలిబాన్లను ప్రశంసిస్తూ ఓ రైటప్ రాశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ముజాహిదీన్‌ల విజయాన్ని ఆయన అందులో కీర్తించారు.

తాలిబాన్, జైషే మొహమ్మద్‌లు భావజాల సారూప్యమున్న సంస్థలుగా పేర్కొంటుంటారు. మసూద్ అజర్ 1999లో భారత జైలు నుంచి విడుదలైన తర్వాత జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. అది అప్పటి నుంచి జమ్ము కశ్మీర్‌లో యాక్టివ్‌గానే ఉన్నది.

పాకిస్తాన్ టెర్రరిస్టులు భారత విమానాన్ని హైజాక్ చేసి మసూద్ అజర్‌ను ప్రయాణికులకు బదులుగా విడుదల చేయించుకున్నారు. కాట్మాండు నుంచి లక్నోకు బయల్దేరిన విమానాన్ని పాకిస్తాన్ టెర్రరిస్టులు హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్‌కు తీసుకెళ్లారు. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల పాలనలో ఉన్నది. కాందహార్ చేరగానే ఆ విమానం చుట్టూ వెంటనే తాలిబాన్లు చుట్టుముట్టారు. అక్కడి పరిస్థితులన్నీ తమ చెప్పుచేతల్లో ఉండేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు. చేసేదేమీ లేక భారత ప్రభుత్వం ఉగ్రవాదుల డిమాండ్‌ను అంగీకరించి అప్పుడు జైలులో ఉన్న మసూద్ అజర్‌ను వారికి అప్పగించి ప్రయాణికులను సురక్షితంగా వెనక్కి రప్పించుకోగలిగింది.

తాలిబాన్లు మళ్లీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలోకి రాగానే జైషే మొహమ్మద్ శ్రేణుల్లో సంతోషం కనిపిస్తున్నట్టు తెలుస్తున్నది. తాలిబాన్ల అండ చూసుకుని కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు పెంచే ముప్పు ఉన్నది.

click me!