ఒక్క వాటర్ బాటిల్ ఖరీదు రూ. 3,000, ప్లేట్ రైస్‌కు రూ. 7,500.. కాబూల్ ఎయిర్‌పోర్టులో ధరలు

By telugu teamFirst Published Aug 27, 2021, 6:40 PM IST
Highlights

కాబుల్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు సమీపంలో ఒక్క వాటర్ బాటిల్ ధర రూ. 3000, ప్లేట్ రైస్ తినాలంటే రూ. 7,500 చెల్లించాల్సిందే. అవి కూడా అఫ్ఘానీ కరెన్సీలో కాదు.. అమెరికన్ డాలర్లలో చెల్లిస్తేనే మోక్షం లభిస్తుంది. సాధారణ ఆఫ్ఘనిస్తాన్ పౌరుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎయిర్‌పోర్టు సమీపంలో రెండు మూడు రోజులు గడపడం గగనంగా మారిందని, ఈ ధరలు వారు భరించలేరని చెబుతున్నారు.

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్లు హస్తగతం చేసుకున్నప్పటి నుంచి వారి క్రూర పాలన నుంచి తప్పించుకుని బయటపడాలన్న ఆశతో వందలు వేలాదిగా ఆ దేశ పౌరులు రాజధాని కాబుల్‌లోని ఎయిర్‌పోర్టుకు తరలివస్తున్నారు. దీంతో ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాలు జనసమ్మర్థంగా మారిపోయాయి. విమానశ్రయంలోపల, బయటా భారీగా నిండిపోయారు. తాజాగా, గురువారం రాత్రి రెండు బాంబు పేలుళ్లు జరిగాయి. ఇందులో వందకు పైగా ప్రజలు ప్రాణాలు విడిచారు. అయినా రోజు గడవక ముందే మళ్లీ యధావిధిగా ప్రజలు విమానాశ్రయ పరిసరాల్లోనే తచ్చాడుతున్నారు.

కొందరు అదృష్టవశాత్తు దేశాన్ని దాటి వెళ్లగలిగారు. ఆ అదృష్టం కోసమే వారంత ఎదరుచూస్తున్నారు. వారికి ఎప్పుడు దేశం వదిలివెళ్లే అవకాశం వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇదే అదునుగా చేసుకున్న స్థానిక వ్యాపారులు పట్టపగలే దోచుకోవడం  మొదలుపెట్టారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎప్పుడు దేశం దాటుదామా? అనుకుంటున్నవారికి అక్కడ కనీసం నీరు కొనుక్కుని తాగాలన్న చెమటలు పడుతున్నాయి. ఇందుకు కారణం ఆకాశాన్నంటుతున్న ధరలు. 

ఓ స్థానికుడు రాయిటర్ సంస్థకు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక్క వాటర్ బాటిల్ కొనాలంటే రూ. 3000 చెల్లించాల్సిందే. కొన్ని రోజులుగా ఎదురుచూస్తుండటంతో తాగునీటితోపాటు ఆహారం కొనుగోలు చేయడం సాధారణమే. కానీ, ప్లేట్ రైస్ కొనుక్కోవాలంటే రూ. 7,500 పెట్టాల్సిందే. అంతేకాదు, ఆ డబ్బులను అఫ్ఘాన్ కరెన్సీలో ఇచ్చినా తీసుకోరు. ఆ సొమ్మునూ అమెరికన్ డాలర్లలో చెల్లించాలి. అలాగైతేనే తాగే నీరైనా, తినడానికి ఆహారమైనా లభిస్తుంది. ఇంతటి దయనీయ పరిస్థితులు కాబుల్ ఎయిర్‌పోర్టులో జరుగుతున్నాయి. ఈ ధరలు ఒక సాధారణ ఆఫ్ఘనిస్తాన్ పౌరుడు భరించలేడు. వీటికితోడు ఎప్పుడు ఎటువైపున బాంబు పేలుతుందో తెలీని ఆందోళన వెంటాడుతూనే ఉంటుంది.

click me!