
ఆఫ్గన్ నుంచి దళాల ఉపసంహరణ విషయంలో అమెరికాలోని బైడెను సర్కారు చేస్తున్న తప్పులకు అంతూ పొంతూ లేకుండా పోతుంది. తాజాగా మరో మహా తప్పిదం చేసినట్లు న్యూయార్క్ పోస్ట్ పత్రిక వెలుగులోకి తెచ్చింది. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా కు సాయం చేసిన వ్యక్తుల జాబితాను తాలిబన్ల చేతికి ఇచ్చినట్లు పేర్కొంది. ఇప్పుడు తాలిబన్లు ఆ జాబితా ఆధారంగా హిట్ లిస్టు రూపొందించుకుని వారి కోసం వెతుకుతున్నారు.
శ్వేత సౌధం బ్రీఫింగ్ తర్వాత దీనిపై ప్రశ్నిస్తే.. ‘ జరిగి ఉండొచ్చు’ అనే సమాధానం వచ్చింది. ఇంతకీ ఇది ఎలా జరిగిందంటే.. ఆగస్టు 15న ఆక్రమణ తర్వాత అమెరికా అధికారులు తాలిబన్లకు ఒక జాబితా ఇచ్చారు. దీంట్లో అమెరికా పౌరులు, మిత్రులు ఉన్నారని వారిని విమానాశ్రయంలోకి అనుమతించాలని తాలిబన్లకు సూచించారు. అప్పటికే ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాలను తాలిబన్లు ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే.
గతంలో అమెరికాకు సాయం చేసిన వారిని క్రూరంగా చంపిన చరిత్ర తాలిబన్లకు ఉంది. ఈ నేపథ్యంలో చివరి సమయంలో తాలిబన్లను గుడ్డిగా నమ్మి ఈ జాబితాను అమెరికా అప్పజెప్పింది. కాబూల్ విమానాశ్రయంపై దాడి అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో బైడెన్ ఇటువంటి జాబితాను అసలు అప్పజెప్పలేదు అని ఖచ్చితంగా చెప్పలేకపోయారు. విమానాశ్రయానికి వచ్చే సమయంలో తమ వారిని లోపలకు వదలమని చెప్పి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
తాలిబన్లు అమెరికాకు సహాయం చేసిన వారిని పట్టుకునేందుకు ఇంటింటికి వెళ్లి సోదాలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో అమెరికాకు వివిధ దశల్లో సాయం చేసిన వేలాది మంది జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. అమెరికా వీసా కోసం అప్లై చేసిన చాలామంది.. తాలిబన్లు కాబుల్ ను ఆక్రమించాక విమానాశ్రయం చేరుకున్నారు.
దీంతో అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ వారిని కొన్నాళ్లు వేచి ఉండమని పేర్కొంది. ఇప్పటికే వారు ఇచ్చిన జాబితాలను క్లియర్ చేసేదాకా... కొత్త వారి పేర్లను.. తరలించే వారి జాబితాలో చేర్చాము అని చెప్పింది.
ఇదిలా ఉండగా.. ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ లో జరగిన పేలుళ్లపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడుల్లో అమెరికా సైనికుల మృతిపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. తమ సైనికుల ప్రాణాలు తీసిన వారిని వదిలిపెట్టబోమని.. ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.
మృతి చెందిన అమెరికా సైనికులను హీరోలుగా ఆయన అభివర్ణించారు. దాడికి పాల్పడింది తామేనని ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ ప్రకటించిన నేపథ్యంలో ఆ ఉగ్రవాద సంస్థ నాయకులను హతమార్చాలని తమ దేశ ఆర్మీని బైడెన్ ఆదేశించారు. ఈ నెల 31కల్లా అఫ్గాన్ నుంచి తమ సైనిక బలగాలను ఉపసంహరించుకుంటామని ఆయన పునరుద్థాటించారు.
గురువారం కాబూల్ విమాశ్రయం వద్ద జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 72మంది మృత్యువాత పడ్డారు. వీరిలో అమెరికాకు చెందిన 11మంది సైనికులు, ఓ నేవీ వైద్యుడు ఉన్నారు. ఆ దేశానికి చెందిన మరో 12 మంది సైనికులు గాయపడ్డారు.
జిహాదీలను తాలిబాన్ మోసం చేసింది.. మా పోరాటం సాగిస్తాం: ఐఎస్ఐఎస్
కాబూల్ ఎయిర్ పోర్ట్ మారణహోమంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ల సహకారంతో అమెరికాకు తరలింపు ప్రక్రియ కొనసాగుతుండగా.. ఐసిస్ ఖోరసాన్ (కె) గ్రూపు మానవబాంబు దాడులతో విరుచుకుపడింది. ఈ దుర్ఘటనలో 60మంది చనిపాగా.. 150 మంది తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక కాబూల్ ఎయిర్ పోర్ట్ జంట పేలుళ్ల మీద అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భావోద్వేగంగా ప్రసంగించారు. గురువారం వైట్ హౌజ్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. బాధ్యులెవరైనా క్షమించే ప్రసక్తే లేదు. ఈ దాడిని అంత తేలికగా మేం మరిచిపోం... ఈ దాడితో ఉగ్రవాదం గెలిచినట్లే కాదు. వెంటాడి, వేటాడి ప్రతీకారం తీర్చుకుంటాం..’ అంటూ ఉద్రేకపూర్వకంగా ప్రసంగించారు.
ఆఫ్గన్ గడ్డమీద అమెరికా దళాల సేవల్ని జ్ఞప్తి తెచ్చుకున్న ఆయన... మరణించిన వాళ్లకు సంఘీభావంగా కాసేపు మౌనంగా ఉండిపోయారు. జరిగిన నష్టానికి తానే బాధ్యత అని ప్రకటించుకున్న బైడెన్... సైన్యం తరలింపు ఆలస్యానికి తమ నిర్ణయాలే కారణమని స్పష్టం చేశారు.