
జపాన్ : కొన్నిసార్లు, కొన్ని మోసాల గురించి వింటుంటే ఆశ్చర్యపోతాం. ఇలా కూడా మోసం చేయవచ్చా? ఇంత అమాయకంగా ఉంటారా? ఇంత ఈజీగా మోసపోతారా? ఏం చెప్పినా ఇలా నమ్మేస్తారా?.. లాజిక్ ఉండదా? కనీసం వయసుతోపాటు వచ్చిన అవగాహన, జ్ఞానంతో నైనా ఆలోచించరా? అనే అనేక రకాల ప్రశ్నలు చుట్టుముడతాయి. జపాన్ లో ఓ మహిళ మోసపోయిన తీరు వింటే ఇలాంటి అనుమానాలే తలెత్తుతాయి.
‘అంతరిక్ష కేంద్రంలో పనిచేస్తున్నా… నీపై మనసు పడ్డా భూమి మీదకు రాగానే పెళ్లి చేసుకుంటాన’ని ఓ వ్యక్తి మాయమాటలు చెప్పాడు. ఆ మహిళ గుడ్డిగా నమ్మింది. అతనికి భారీ మొత్తంలో సొమ్ము ముట్టజెప్పింది. ఆ తర్వాత మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెడితే.. జపాన్ కు చెందిన 65 యేళ్ల మహిళకు సామాజిక మాధ్యమంలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. రష్యా కు చెందిన వ్యోమగామిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాల పేరెంట్ కంపెనీ మెటా తీవ్రవాద సంస్థనటా.. ఎక్కడంటే?
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పని చేస్తున్నట్లు కొన్ని నకిలీ ఫోటోలను కూడా ఆమెతో పంచుకున్నాడు. ఆపై తరచూ ఇద్దరు మెసేజ్లు చేసుకోవడంతో కొద్దిరోజుల్లోనే వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆమె పూర్తిగా తాను చెప్పిన కట్టుకథను నమ్మిందని నిర్ణారణ వచ్చిన తరువాత... ఆ నకిలీ వ్యోమగామి ఆ మహిళ ముందుకు పెళ్లి ప్రతిపాదన ఉంచాడు. గాఢంగా ప్రేమిస్తున్నాను.. అని భూమి మీదకు రాగానే వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. అసలు వ్యోమగాములకు సోషల్ మీడియా యాక్సెస్ ఉంటుందా? వారు ఇలా ఇంత తీరిగ్గా ఛాటింగ్ చేస్తారా? అనే అనుమానం ఆమెకు రాలేదు.
పైగా, అతను తాను తిరిగి భూమి మీదకు రావాలంటే డబ్బు ఖర్చు అవుతుందని జపాన్ కు వెళ్లగలిగే రాకెట్ లాండింగ్ ఫీజు చెల్లించాలంటూ ఆమెను నమ్మించాడు. అప్పటికీ అలా ప్రైవేటుగా డబ్బులు ఎందుకు కట్టాలి?అనే అనుమానం తలెత్తలేదు. అతడి మాటలను నిజమని భావించింది. దీంతో సదరు మహిళ ఐదు దఫాల్లో అతడు చెప్పిన ఓ ఖాతాకు 4.4 మిలియన్ యెన్ లు (దాదాపు రూ.24.8 లక్షలు) పంపించింది. అయినప్పటికీ మరింత డబ్బు అడగడంతో అనుమానంతో చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, అతడు నకిలీ వ్యోమగామి అని పోలీసులు తేల్చారు. ఈ కేసు కు ‘అంతర్జాతీయ రొమాన్స్ స్కామ్’గా పేరు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు.