సునామీ హెచ్చరికలు జారీ చేసిన జపాన్.. తైవాన్‌లో భారీ భూకంపం

By Mahesh KFirst Published Sep 18, 2022, 3:16 PM IST
Highlights

తైవాన్ ఆగ్నేయ తీరంలో  భారీ భూకంపం సంభవించింది. ఫలితంగా దాని సమీపంలోని దీవులకు జపాన్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఒక్క మీటర్ ఎత్తుతో అలలు ఎగసిపడవచ్చని అంచనా వేసింది.
 

న్యూఢిల్లీ: జపాన్ సునామీ హెచ్చరికలు 2011 పీడకలను జ్ఞప్తికి తెస్తున్నది. ఆ సునామీ వేలాది కుటుంబాలను విషాదంలోకి నెట్టింది. ఒక్కసారిగా అలలు లేసి వచ్చి తీర ప్రాంతాలను మింగేసింది. ఆ అలల పంజాలోనే వేలాది మంది సముద్రంలోకి కొట్టుకుపోయారు. సుమారు పది వేల మందిని ఆ సునామీ పొట్టనబెట్టుకున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంతకు మించి అదృశ్యమైన వారి సంఖ్య ఉన్నది. అప్పటి భయానక వీడియోలు, చిత్రాలు ఇప్పటికీ చాలా మందిని వెంటాడుతుంటాయి. అలాంటి జపాన్ తాజాగా మరోసారి సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తైవాన్ ఆగ్నేయ నగరంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 6.9గా నమోదైంది.

తైవాన్ ఆగ్నేయ తీరంలో ఆదివారం భూకంపం సంభవించింది. తద్వార యూలీ నగరం భీతిల్లింది. ఓ చిన్న పట్టణంలో కనీసం ఒక భవనమైనా నేల కూలిందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంప తీవ్రతను దృష్టిలో పెట్టుకుని జపాన్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది.

తైవాన్ నగరం తైతుంగ్‌కు ఉత్తరాన 30 మైళ్ల దూరంలో మధ్యాహ్నం 2.44 గంటల ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమై ఉన్నట్టు యూఎస్‌జీఎస్ అంచనా వేసింది. తొలుత ఈ భూకంప తీవ్రతను 7.2గా పేర్కొన్నప్పటికీ ఆ తర్వాత దాని తీవ్రతను తగ్గించి 6.9గా తెలిపింది.

యులీ నగరంలో ఓ బిల్డింగ్ కుప్పకూలిందని తైవాన్ మీడియా ఏజెన్సీ సీఎన్ఏ తెలిపింది. ఈ భూకంప ప్రకంపనలు రాజధాని నగరం తైపేయిలోనూ కనిపించాయని వివరించింది. ఈ రీజియన్‌లోనే శనివారం కూడా 6.6 తీవ్రతతో భూమి కంపించింది. కానీ, ఆదివారం ఎక్కువ తీవ్రతతో భూకంపం వచ్చింది. 

తైవాన్ సమీపంలోని ద్వీపాలకు జపాన్ మెటీయరలాజికల్ ఏజెన్సీ సునామీ వార్నింగ్ ఇచ్చింది. సముద్ర అలలు ఒక మీటర్ ఎత్తుతో రావొచ్చని తెలిపింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఎక్కువ ఎత్తుతో అలలు రావొచ్చని అంచనా వేసింది.

చైనా తీర ప్రాంతాల్లోనూ భూకంప ప్రకంపనలు వచ్చాయి. తీర ప్రాంతాలు ఫఉజియన్, గువాంగ్‌డాంగ్, జియాంగ్సు, షాంఘై సహా పలు చోట్ల ఈ ప్రకంపనలు వచ్చినట్టు చైనా ఎర్త్‌క్వేక్ నెట్‌వర్క్ సెంటర్ తెలిపింది. 

తైవాన్‌లో ఎక్కువ భూకంపాలు చోటుచేసుకుంటాయి. ఇది రెండు టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ప్రాంతంలో ఉన్నది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పైనే ఈ దేశం ఉన్నది. తైవాన్‌లో అతి ప్రమాదకర భూకంపం 7.6 తీవ్రతతో 1999 సెప్టెంబర్‌లో సంభవించింది. ఇది సుమారు 2,400 మంది ఉసురు తీసింది.

click me!