వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నా.. ఆ ఉద్యోగులకు నో స్మోకింగ్ ఆర్డర్.. మానేయడానికి ఆర్థిక సహాయం కూడా!

By telugu teamFirst Published Sep 3, 2021, 2:37 PM IST
Highlights

వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నప్పటికీ తమ ఉద్యోగులు స్మోకింగ్ చేయరాదని జపాన్ కంపెనీ నోమురా హోల్డింగ్ ఇటీవలే ఓ నిర్ణయం తీసుకుంది. తద్వారా ఉద్యోగల ఆరోగ్యంతోపాటు కంపెనీకి వారి పూర్తి సామర్థ్యం ఉపకరిస్తుందని, పనిచేసే చోటా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుందని సంస్థ భావిస్తున్నది. ఈ సూచన ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలేవీ ఉండబోవని సంస్థ వివరించింది. కంపెనీలోని స్మోకింగ్ రూమ్స్‌నూ డిసెంబర్‌లోగా పూర్తిగా తొలగిస్తామని తెలిపింది.

న్యూఢిల్లీ: ఓ కంపెనీ తమ ఉద్యోగుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నప్పటికీ స్మోకింగ్ చేయవద్దని మెమో జారీ చేసింది. అంతేకాదు, గత నాలుగేళ్ల నుంచి స్మోకింగ్ మానేయడానికి ఉద్యోగులకు ఆర్థిక సహాయం కూడా చేస్తున్నది. జపాన్‌కు చెందిన టాప్ బ్రోకరేజ్ సంస్థ నోమురా హోల్డింగ్ ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నుంచి తమ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నప్పటికీ దూమపానాన్ని మానుకోవాలని సూచిస్తూ సంస్థ మెమో పంపినట్టు సంస్థ ప్రతినిధి యోషితక ఒత్సు తెలిపారు.

వర్క్ ఫ్రమ్ హోం కంటే ముందు ఆఫీసులోనూ ప్రత్యేకంగా స్మోకింగ్ రూమ్‌లు ఏర్పాటు చేసింది ఈ కంపెనీ. తద్వారా స్మోకింగ్ చేస్తుండగా ఇతరులు ఆ పొగ పీల్చకుండా నివారించవచ్చుననేది సంస్థ భావన. లంచ్ టైమ్‌లో స్మోకింగ్ చేసినా, కంపెనీలోకి మళ్లీ ఎంటర్ కావడానికి 45 నిమిషాలు సమయం తీసుకోవాలన్న నిబంధన కూడా ఉద్యోగులకు పెట్టింది. ఈ డిసెంబర్‌కల్లా కంపెనీలో స్మోకింగ్ రూమ్స్ పూర్తిగా తొలగించనుంది.

కంపెనీలో స్వచ్ఛమైన వాతావరణం ఉండాలని, ఉద్యోగులూ స్మోకింగ్ చేయకుంటే వారి పూర్తి సామర్థ్యాలు సంస్థకు ఉపయోగపడుతాయని మెమోలో నోమురా పేర్కొంది. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నవారూ విధిగా స్మోకింగ్ నుంచి దూరంగా ఉండాలని తెలిపింది. కానీ, ఈ సూచనలనూ కాదని స్మోకింగ్ చేసినవారిపై కఠిన చర్యలేవీ ఉండబోవని, తమ ఉద్యోగులు స్మోకింగ్ నుంచి దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉండాలనేదే సంస్థ లక్ష్యమని ఒత్సు వివరించారు.

జపాన్‌లో నొమురాకు ముందే స్నాక్స్ కంపెనీ కాల్బీ, ఫుడ్ ప్రొడ్యూసర్ అజినొమోటో, సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ సహా పలు సంస్థలు ఉద్యోగులు స్మోకింగ్ చేయకుండా నిర్ణయాలు తీసుకున్నాయి.

click me!