గాజాపై భూతల దాడులు ఉధృతం.. బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్.. కమ్యూనికేషన్ బ్లాక్‌అవుట్‌!!

ఇజ్రాయెల్-హమాస్ యుద్దం కొనసాగుతుంది. హమాస్‌ సభ్యులు, నేతలను ఏరివేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రతిదాడులను కొనసాగిస్తుంది.

Google News Follow Us

ఇజ్రాయెల్-హమాస్ యుద్దం కొనసాగుతుంది. హమాస్‌ సభ్యులు, నేతలను ఏరివేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రతిదాడులను కొనసాగిస్తుంది. తాజాగా గాజాపై ఇజ్రాయెల్ భూతల దాడులకు దిగింది. అయితే భూతల దాడులను విస్తరిస్తున్నట్టుగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి శుక్రవారం ప్రకటించారు. ఇక, గాజాపై  ఇజ్రాయెల్ జరిపి తీవ్రమైన వైమానిక దాడులు.. కమ్యూనికేషన్‌ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసినట్టుగా నివేదికలు పేర్కొంటున్నాయి. 

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అన్ని విధాలుగా బలంగా ముందుకు సాగుతున్నారని..  గాజా నగరంపై తీవ్రమైన దాడిని కొనసాగిస్తుందని డేనియల్ హగారి చెప్పారు. పౌరులు నగరాన్ని ఖాళీ చేయాలని మునుపటి హెచ్చరికలను హగారి పునరావృతం చేశారు. గాజాపై భూతల దాడులను ఉధృతం చేసిన ఐడీఎఫ్.. బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇక, గాజాలోని హమాస్‌ నేతలు, కమాండ్‌ సెంటర్లు, సొరంగాలు, రాకెట్‌ లాంచర్లను టార్గెట్‌గా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 

ఇజ్రాయెల్ వైమానిక దళం గాజాపై మరింతగా వినాశకరమైన దాడికి దిగుతున్నట్టుగా తెలుస్తోంది.  ఉత్తర గాజా పైన గత రాత్రి ఆకాశంలో నారింజ రంగు పేలుళ్లు సంభవించాయి. సినాయ్‌లోని ఈజిప్టు పట్టణాల వరకు విజృంభణలు వినిపించింది. పాలస్తీనా నెట్‌వర్క్ జవ్వాల్, గ్లోబల్ మానిటరింగ్ గ్రూప్ నెట్‌బ్లాక్స్.. ఫోన్, ఇంటర్నెట్‌తో సహా సేవలు నిలిపివేయబడినట్లు నివేదించాయి. ఇదిలాఉంటే.. గాజాలో ఇంటర్నెట్ సేవలు దాదాపు పూర్తిగా బ్లాక్‌అవుట్‌కు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. 

ఇదిలాఉంటే, అంతకుముందు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి మాట్లాడుతూ.. హమాస్‌ను నాశనం చేయడానికి ఇజ్రాయెల్ త్వరలో గాజాలోకి సుదీర్ఘమైన, కష్టతరమైన భూదాడిని ప్రారంభించాలని భావిస్తోందని చెప్పారు. ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు కూడా గురువారం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. గ్రౌండ్‌వార్‌కు సిద్ధమైనట్లు ప్రకటించారు. ఇక, గాజాలో మరణాల సంఖ్య 7,300గా ఉన్నట్లు గాజా అధికార వర్గాలు తెలిపాయి.