9/11 దాడి రహస్య పత్రాల వెల్లడికి బైడెన్ ఆదేశం.. అల్ ఖైదాకు సౌదీ అరేబియా సహాయం?

By telugu teamFirst Published Sep 4, 2021, 1:22 PM IST
Highlights

2001 సెప్టెంబర్ 11న అమెరికా పెంటగాన్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై విమానాలతో జరిగిన దాడికి సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతపరచాలని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. వచ్చే ఆరు నెలల్లో ఈ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. ఈ ఘటన జరిగిన 20 ఏళ్లు నిండుతున్న వీటిని బహిరంగపరచాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఆ దాడి బాధిత కుటుంబాలు ఏళ్ల తరబడి రహస్య పత్రాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 9/11 దాడికి పాల్పడ్డ అల్ ఖైదాకు అమెరికా సన్నిహిత దేశం సౌదీ అరేబియా సహాయపడి ఉంటుందన్న అనుమానాలు వారిలో ఉన్నాయి.

వాషింగ్టన్: అమెరికా చరిత్రలోనే పెద్దదాడిగా భావించే 9/11 అటాక్‌కు సంబంధించిన రహస్య పత్రాలను వెల్లడి చేయాలని ఆ దేశాధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ ఆదేశించారు. ఈ దాడి జరిగి 20ఏళ్లు కావస్తున్న తరుణంలో అధ్యక్షుడు ఈ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ‘నేను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నప్పుడే 2001, సెప్టెంబర్ 11 దాడి పత్రాలను బహిర్గతం చేస్తానని హామీనిచ్చాను. ఈ దాడికి 20ఏళ్లు నిండుతున్న సందర్భంగా నా హామీని నెరవేర్చాలని భావిస్తున్నాను’ అని ఆ ఆదేశాల్లో బైడెన్ పేర్కొన్నారు. వచ్చే ఆరు నెలల్లో వీటిని బహిరంగపరిచే ప్రక్రియను చేపట్టాలని సంబంధిత అధికారులు, ఏజెన్సీని ఆదేశించారు.

ఈ పత్రాలను బహిరంగపరచాలని 9/11 దాడిలో మరణించిన సుమారు మూడు వేల మందికి సంబంధించిన కుటుంబాలు అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. అమెరికాకు సన్నిహిత దేశమైన సౌదీ అరేబియా అల్ ఖైదా ఉగ్రవాదులకు సహాయం చేసి ఉండవచ్చనే అనుమానాలు వారిలో కొనసాగుతున్నాయి. పెంటగాన్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై విమానాలను హైజాక్ చేసి దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులకు సౌదీ అరేబియాకు సంబంధాలున్నాయని చాన్నాళ్లుగా వాళ్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయాలపై స్పష్టత రావడానికి తగిన ఆధారాలు అందుబాటులో లేవని, చాలా పరిమితంగానే ఈ దాడి ఘటన వివరాలు ప్రభుత్వం విడుదల చేసిందని బాధిత కుటుంబాలు వాదిస్తున్నాయి. 

అమెరికా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన 9/11 కమిషన్ అధికారులు చేసిన ప్రకటనలు బాధిత కుటుంబాల అనుమానాలకు మరింత ఆజ్యం పోశాయి. సౌదీ ప్రభుత్వం ఒక సంస్థగా లేదా సీనియర్ సౌదీ అరేబియా అధికారులు అల్ ఖైదాకు ఫండింగ్ చేసినట్టు ఆధారాలు లేవని 9/11 కమిషన్ అధికారులు వెల్లడించారు. ఈ ప్రకటనపై మరిన్ని సందేహాలు ఏర్పడ్డాయి. అంటే సౌదీ అరేబియాలోని దిగువస్థాయి అధికారులు అల్ ఖైదాకు దన్నుగా నిలిచి ఉన్నారా? అనే ప్రశ్నలు లేవనెత్తారు. 9/11 దాడి బాధిత కుటుంబాల బాధలు ఎన్నటికీ విస్మరించబోమని బైడెన్ పేర్కొంటూ ఆ ఘటన తాలూకు వివరాల్లో పారదర్శకంగా ఉంటామని తెలిపారు.

click me!