పెద్దనోట్ల రద్దు, కఠిన నిఘా వృథాయేనా: స్విస్ బ్యాంకుల్లో భారీగా పెరిగిన భారతీయుల సంపద

By Siva KodatiFirst Published Jun 18, 2021, 4:04 PM IST
Highlights

పెద్ద నోట్ల రద్దు వంటి భారీ సంస్కరణలు చేపట్టినా, కఠిన చర్యలు, కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా వున్నప్పటికీ స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద భారీగా పెరిగిపోతోంది.  తాజా గణాంకాల ప్రకారం... ఈ మొత్తం రూ. 20,700 కోట్లకు చేరుకుందట

పెద్ద నోట్ల రద్దు వంటి భారీ సంస్కరణలు చేపట్టినా, కఠిన చర్యలు, కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా వున్నప్పటికీ స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద భారీగా పెరిగిపోతోంది.  తాజా గణాంకాల ప్రకారం... ఈ మొత్తం రూ. 20,700 కోట్లకు చేరుకుందట. గతేడాది చివరి నాటికి వెలుగులోకి వచ్చిన లెక్కలివి. రెండేళ్ల పాటు క్షీణించినప్పటికీ గతేడాది మాత్రం ఈ సంపద పెరిగిపోయింది. ఈ క్రమంలో... స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద 13 సంవత్సరాల గరిష్టానికి చేరుకుంది.

2019 చివరినాటికి భారతీయులు, భారతీయ కంపెనీలు దాచుకున్న సొమ్ము విలువ దాదాపు రూ. 6,625 కోట్లుగా తేలింది. బాండ్స్, ఇతర పథకాల్లో డిపాజిట్ చేసిన మొత్తం భారీగా పెరగడమే ఇందుకు కారణంగా నిపుణులు భావిస్తున్నారు. ఖాతాదారుల డిపాజిట్లు 2020 లో క్షీణించినట్లు స్విట్జర్లాంట్ సెంట్రల్ బ్యాంకు విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. అన్ని స్విస్ బ్యాంకుల్లో కస్టమర్ల డిపాజిట్లు 2020 సంవత్సరంలో దాదాపు రెండు ల‌క్ష‌ల కోట్ల స్విస్ ఫ్రాంక్స్‌కు చేరుకున్నాయి.

Also Read:మళ్ళీ నోట్ల రద్దు చేయనున్నారా.. రెండేళ్లలో ఒక్క నోటు కూడా ముద్రించలేదు.. ప్రభుత్వ ఉద్దేశం ఎంటో తెలుసుకోండి ?

ఇందులో విదేశీ ఖాతాదారుల డిపాజిట్లు 600 బిలియన్ డాలర్లు. 377 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లతో బ్రిటన్ అగ్రస్థానంలో, 152 బిలియన్ డాలర్లతో అమెరికా రెండో స్థానంలో నిలిచాయి. వంద బిలియన్ ఫ్రాంక్స్‌‌లకు పైగా ఉన్న దేశాలు ఈ రెండు మాత్రమే.  2006లో స్విస్ బ్యాంకుల్లో భారతీయులు, భారత కంపెనీల నిధులు 6.5 బిలియన్ డాలర్లు కాగా, 2011, 2013, 2017 సహా మరికొన్ని సంవత్సరాలను మినహాయిస్తే మిగిలిన సంవత్సరాల్లో ఈ మొత్తం తగ్గింది. గతేడాది కస్టమర్ అకౌంట్ డిపాజిట్ 503.9 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్ ( భారత కరెన్సీలో రూ. 4 వేల కోట్లు). 2019లో ఈ మొత్తం 550 మిలియన్ ఫ్రాంక్‌లు. 

తమ బ్యాంకుల్లో విదేశీయులు  దాచిన సొమ్మును నల్లధనంగా పరిగణించలేమని స్విట్జర్లాండ్ పలుమార్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే పన్ను ఎగవేతలు, అక్రమార్జన వంటి కేసుల విషయంలో విచారణకు మాత్రం భారత్‌కు సహకరిస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి ఇరు దేశాల మధ్య 2018 నుండి అవగాహన ఒప్పందం అమల్లో ఉంది.

click me!