
సింగపూర్ పార్లమెంట్ సభ్యుల మధ్య వివాహేతర సంబంధాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా తన తోటి ఎంపీతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సింగపూర్‌లోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి చెందిన భారతీయ సంతతి పార్లమెంటేరియన్ లియోన్ పెరెరా తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ పార్టీ బుధవారం ప్రకటన చేసింది. వర్కర్స్ పార్టీ (డబ్ల్యూపీ)కి చెందిన పెరెరా(53), నికోల్ సీహ్ (36)లు వివాహేతర సంబంధం కారణంగా రాజీనామా చేసినట్లు పార్టీ సెక్రటరీ జనరల్ ప్రీతమ్ సింగ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. పార్లమెంటు సభ్యుడి (ఎంపీ) పదవికి రాజీనామా చేస్తానని పెరీరా పార్లమెంటు తాత్కాలిక స్పీకర్‌కు తెలియజేసినట్లుగా తెలిపారు. పెరెరా, సీహ్ ఇద్దరూ వివాహితులే. వారికి పిల్లలు కూడా ఉన్నారు.
పార్లమెంటు స్పీకర్ టాన్ చువాన్-జిన్, తోటి పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ) ఎంపీ చెంగ్ లీ హుయ్ ఎఫైర్ కలిగి ఉన్నందుకు సోమవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. టాన్, చెంగ్ ఇద్దరూ తమ పార్లమెంటరీ స్థానాన్ని వదిలిపెట్టడమే కాకుండా పార్టీకి రాజీనామా చేశారు. ఇది జరిగిన రెండు రోజులకే తాజా పరిణామం చోటుచేసుకుంది.
‘‘2020 సార్వత్రిక ఎన్నికల తర్వాత వారి మధ్య ఎఫైర్ ప్రారంభమైందని.. అయితే అది కొంతకాలం క్రితం ఆగిపోయిందని వారిద్దరూ అంగీకరించారు’’ అని ప్రీతమ్ సింగ్ చెప్పారు. అయితే వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని గతంలో ఆరోపణలు రాగా.. పెరెరా, సీహ్‌లు అందులో ఎలాంటి నిజం లేదని పార్టీకి తెలియజేశారు. ఇక, ‘‘పెరెరా ప్రవర్తన, ఆరోపణల గురించి పార్టీ నాయకత్వం అడిగినప్పుడు నిజం చెప్పకపోవడం వర్కర్స్ పార్టీ ఎంపీలు ఆశించిన ప్రమాణాల కంటే తక్కువగా ఉంది. ఇది ఆమోదయోగ్యం కాదు’’ అని ప్రీతమ్ సింగ్ పేర్కొన్నారు.
అయితే వీరిద్దరికి సంబంధించి తాజాగా ఓ వీడియో బయటకు వచ్చింది. వెలుగులోకి వచ్చిన 15 సెకన్ల నిశ్శబ్ద క్లిప్‌లో అల్జునీడ్ ఎంపీగా ఉన్న పెరెరా .. 2020 సార్వత్రిక ఎన్నికల అభ్యర్థి సీహ్‌తో కలిసి భోజనం చేస్తూ ఆమె చేతులు పట్టుకుని ఉండటం కనిపించింది. అయితే ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారో తెలియరాలేదు. అయితే సోమవారం ఈ వీడియోను మొదటిసారి చూసిందని వర్కర్స్ పార్టీ తెలిపింది. పెరెరా డ్రైవర్ 2021 ప్రారంభంలో పార్టీ నాయకుడిని సంప్రదించారని.. పెరెరా, సీహ్‌లు రెస్టారెంట్‌లు, హోటళ్లలో చాలా తరచుగా కలుస్తున్నారని, వారు కౌగిలించుకుంటున్నారని ఫిర్యాదు చేసినట్టుగా పేర్కొంది.
అయితే ఆ సమయంలో ఆరోపణకు మద్దతు ఇవ్వడానికి ఎటువంటి ఆధారాలు లేదా ధృవీకరించే సమాచారం లేదని ప్రీతమ్ సింగ్ చెప్పారు. అప్పుడు పెరెరా ఆ వాదనలను ఖండించారని తెలిపారు.