
అమెరికాలో ఓ భారత సంతతికి చెందిన వ్యక్తి తన కూతురు, అత్తలను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో మరో మహిళ తీవ్రంగా గాయపడింది.
వివరాల్లోకి వెడితే.. భారత సంతతికి చెందిన భూపేందర్ సింగ్ (57) తన కుటుంబంతో కలిసి న్యూయార్క్‌లోని షోడాక్ పట్టణంలో నివసిస్తున్నాడు. అయితే ఏం జరిగితో తెలియదు కానీ బుధవారం రోజు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తన కూతురు జస్లీన్ కౌర్ (14), అత్త మంజీత్ కౌర్‌పై తుపాకీతో దాడి చేశాడు.
వారిద్దరినీ తుపాకీతో కాల్చి, తను కూడా కాల్చుకుని మరణించాడు. ఈ దాడిలో మరో మహిళ కూడా తీవ్రంగా గాయపడింది. కాల్పుల శబ్దాలతో అప్రమత్తమైన స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 14ఏళ్ల జస్లీన్ కౌర్, మంజీత్ కౌర్ ఇద్దరూ తూపాకీతో కాల్చడం వల్లే మరణించినట్టు తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. గాయపడ్డ మహిళ ప్రస్తుతం అల్బానీ మెడికల్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. ఆమెకు ప్రాణాపాయం లేదని వెల్లడించారు. ఘటనపై ఆమె నుంచి మరింత సమాచారాన్ని సేకరించనున్నట్టు పేర్కొన్నారు.