
కెనడాలోని హిందూ దేవాలయాలపై వరుస దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా కెనడాలని మిస్సిసాగా నగరంలోని రామమందిరంను దుండగులు ధ్వంసం చేశారు. భారత్ వ్యతిరేక నినాదాలను కూడా అక్కడ గ్రాఫిటీతో చిత్రీంచారు. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆ దేశంలోని అధికారులను కోరింది. "మిస్సిసాగాలోని రామమందిరాన్ని భారత వ్యతిరేక గ్రాఫిటీతో ధ్వంసం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ ఘటనపై విచారణ జరిపి నేరస్థులపై సత్వర చర్యలు తీసుకోవాలని మేము కెనడా అధికారులను అభ్యర్థించాము’’ అని టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ బుధవారం ఉదయం ట్వీట్ చేశారు.
ఈ ఘటనపై బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ తీవ్రంగా స్పందించారు. కెనడాలో ద్వేషానికి తావు లేదని చెప్పారు. ‘‘మిస్సిసాగాలోని రామమందిరం ఆలయంలో విద్వేషపూరిత విధ్వంసం గురించి విన్నందుకు నేను బాధపడ్డాను. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయం వెనుక గోడలపై పెయింట్ స్ప్రే చేశారు. పీల్ ప్రాంతంలో ఈ రకమైన ద్వేషానికి చోటు లేదు’’ మేయర్ బ్రౌన్ బుధవారం ట్వీట్ చేశారు. పీల్ పోలీసులు, పీల్ రీజినల్ పోలీస్ చీఫ్ నిషాన్ దురైయప్ప ఈ ద్వేషపూరిత నేరాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారని చెప్పారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ జరుపుతున్నారని.. వారు బాధ్యులను కనుగొంటారని తెలిపారు. కెనడాలో మత స్వేచ్ఛ అనేది ఒక చార్టర్ హక్కు అని.. ప్రతి ఒక్కరూ వారి ప్రార్థనా స్థలంలో సురక్షితంగా ఉన్నారని నిర్ధారించుకోవడానికి తాము చేయగలిగినదంతా చేస్తామని అన్నారు.
ఇక, ఈ ఏడాది ఆరంభం నుంచి కెనడా అంతటా హిందూ దేవాలయాలపై దాదాపు అరడజను విధ్వంసం, ద్వేషపూరిత గ్రాఫిటీ, బద్దలు కొట్టడం, దొంగతనాలు వంటి సంఘటనలతో వరుస దాడులు జరిగాయి. మీడియా కథనాల ప్రకారం గత వారం ఇదే ఆలయంలో విఫలమైన చోరీ ప్రయత్నం కూడా జరిగింది. సెక్యూరిటీ అలారం మోగడంతో దొంగలు పారిపోయినట్లు సమాచారం. ఇది జరిగిన ఒక రోజు తర్వాత.. బ్రాంప్టన్‌లోని భారత్ మాతా మందిర్‌లో దొంగలు విరాళాల పెట్టె కలెక్షన్‌లతో తప్పించుకున్నారని మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఆలయ గోడపై భారత వ్యతిరేక, మోదీ వ్యతిరేక నినాదాలతో కూడిన ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. గత నెలలో బ్రాంప్టన్‌లోని గౌరీ శంకర్ మందిర్‌పై "భారత వ్యతిరేక" గ్రాఫిటీతో ధ్వంసం చేయబడింది.