Afghanistan: తొమ్మిదేళ్ల కూతురిని అమ్మేసిన తండ్రి.. ‘బతకాలంటే తప్పట్లేదు’

By telugu teamFirst Published Nov 2, 2021, 2:44 PM IST
Highlights

ఆఫ్ఘనిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ సహకారం నిలిపివేత, పేదరికం, ఆకలి కేకలు పెరుగుతుండటంతో ప్రజలు దీన స్థితికి చేరుతున్నారు. రోజువారీ అవసరాల కోసమూ వెచ్చించే స్తోమత లేనివారుగా మారుతున్నారు. జీవించి ఉండటానికే డబ్బుల్లేక కన్న కూతుర్లను అమ్ముకునే దుస్థితికి కుటుంబాలు దిగజారిపోయాయి. తాజాగా, బద్ఘిస ప్రావిన్స్‌లోని ఓ క్యాంప్‌లో ఓ తండ్రి తన తొమ్మిదేళ్ల తన కూతురుని అమ్మేశారు. ఘోరి ప్రావిన్స్‌లోనూ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.
 

న్యూఢిల్లీ: Taliban పాలనలో Afghanistanలో పరిస్థితులు మళ్లీ దారుణంగా మారుతున్నాయి. దేశం ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్నది. జనజీవనం అస్తవ్యస్తమవుతున్నది. రోజువారీ అవసరాలూ తీర్చుకోవడం కష్టసాధ్యమవుతున్నది. కనీసం ఇంకొన్ని సంవత్సరాలైనా బతికితే చాలు అనేంతటి దుస్థితికి ప్రజలు పడిపోయారు. ఈ పరిస్థితుల్లేనే కుటుంబాలు కౌమారదశలోని పిల్లలను సంపన్న వృద్ధులకు అమ్ముకుంటున్నారు. మిగతా కుటుంబ సభ్యులను కాపాడుకోవడానికి తన కూతురును అమ్ముతున్నట్టు అబ్దుల్ మాలిక్ తెలిపారు.

ఆ హృదయవిదారక వివరాలు ఇలా ఉన్నాయి. పేదరికం(Poverty), ఆకలి(Starvation), అస్థిరత్వానికి ఆ బాలికలు బలైపోతున్నారు. తన తొమ్మిదేళ్ల కూతురు పర్వానా మాలిక్‌ను 55ఏళ్ల ఖోర్బన్‌కు గత నెల అమ్మినట్టు తండ్రి అబ్దుల్ మాలిక్ వివరించారు. రెండు నెలల క్రితమే తన 12ఏళ్ల కూతురిని అమ్మేసినట్టు చెప్పారు. ఇప్పుడు మరో కూతురిని అమ్మేయక తప్పడం లేదని వాపోయారు. మిగతా కుటుంబ సభ్యులు ప్రాణాలతో ఉండాలంటే ఈ నిర్ణయం తప్పడం లేదని చెప్పారు. ఈ నిర్ణయం తనను దహించి వేస్తున్నదని, సిగ్గుతో మనసు గింజుకుంటున్నా తప్పడం లేదని వివరించారు.

తాను బాగా చదువుకుని టీచర్ కావాలని ఆశపడ్డట్టు పర్వానా మాలిక్ చెప్పారు. కానీ, తన కోరికలకు కుటుంబ ఆర్థిక పరిస్థితులు తలుపులు మూశాయని చెప్పారు. ఈ పెళ్లి తనలో భయాందోళనలు పుట్టిస్తున్నదని, ఆ వృద్ధుడు తనను చితక బాదుతాడని వణుకుతూ చెప్పారు. ఇంటి పనికే తనను పరిమితం చేస్తారని అన్నారు. రెండు రోజుల తర్వాత ఆ వృద్ధుడు వచ్చి పర్వానా మాలిక్‌ను తీసుకెళ్లాడు. రెండు లక్షల అఫ్ఘానీల విలువ చేసే భూమి, గొర్రెలు, నగదు ఇచ్చి ఆ బాలికను వెంట బెట్టుకుని వెళ్లాడు. తన కూతురిని జాగ్రత్తగా చూసుకోవాలని, కొట్టవద్దని ప్రాధేయపడ్డాడు. దానికి ఆ వృద్ధుడు తన కుటుంబ సభ్యుల్లాగే చూస్తానులే అని అన్నాడు. బద్ఘిస ప్రావిన్స్‌లో అంతర్గత శరణార్థులకే ఏర్పాటు చేసిన క్యాంప్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Also Read: Taliban: ‘పెళ్లి విందులో మ్యూజిక్ ఆపడానికి 13 మందిని కాల్చి చంపారు’

ఈ ప్రావిన్స్‌కు సమీపంలోని ఘోరీ ప్రావిన్స్‌లోనూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పదేళ్ల మాగుల్‌నూ 70ఏళ్ల వృద్ధుడికి అమ్మేశారు. ఆ వ్యక్తి ఇచ్చిన రుణాల కిందకు ఆ అమ్మాయిని అమ్మేశారు. ఈ నిర్ణయంపై మాగుల్ ఆందోళనతో ఉన్నారు. నేను నా కుటుంబాన్ని వదిలి వెళ్లను. ఒకవేళ వాళ్లు నన్ను పోవాలని బలవంతపెడితే.. ఆత్మహత్య చేసుకుంటాను అంటూ కన్నీరు కారుస్తూ చెప్పారు.

పర్వానా, మాగుల్ తరహాలోనే ఆఫ్ఘనిస్తాన్‌లో ఇప్పుడు పేదరికానికి, ఆకలికి, అవస్థలకు బాలికలు బలైపోతున్నారు. తాలిబాన్ పాలకులు మహిళలకు సెకండరీ ఎడ్యుకేషన్‌లోకి ప్రవేశాన్ని నిషేధించారు. దేశ ఆర్థిక వ్యవస్థం పతనమవడం, అంతర్జాతీయ ఆర్థిక సహకారం నిలిచిపోవడంతో ఈ మ్యారేజ్ మార్కెట్ బార్లా తెరుచుకుంది.

Also Read: కాందహార్ మసీదుపై దాడి: ఆఫ్ఘనిస్తాన్‌లో సామూహిక అంత్యక్రియలు.. చిత్రాలివే

బాలికలు స్కూల్‌కు వెళ్లుతున్నంత కాలం సురక్షితమేనని, అలాగైతేనే కుటుంబాలు వారి భవిష్యత్తు కోసం వెచ్చిస్తారని మానవ హక్కుల సంఘం నేత హీదర్ బార్ చెప్పారు. విద్య నుంచి వారిని పక్కన పెడితే.. వారిని పెళ్లి చేసి పంపడమే ముందుకు వస్తుందని వివరించారు.

click me!