భారత్ విధానాలు సూపర్.. డబ్బులిచ్చి పదవిని కాపాడుకోలేను : ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Mar 20, 2022, 08:24 PM IST
భారత్ విధానాలు సూపర్.. డబ్బులిచ్చి పదవిని కాపాడుకోలేను : ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో  పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత విధానాలు బాగుంటాయని.. అలాగే అక్కడి ఆర్మీ సైతం ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకోదని ఇమ్రాన్ ప్రశంసించారు. 

వీలున్నప్పుడల్లా భారత్‌పై అక్కసు వెళ్లగక్కే పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) .. తన వైఖరికి భిన్నంగా ఇండియాను ప్రశంసల్లో ముంచెత్తారు. ఖైబర్‌ ఫక్తూన్వాలో ఆదివారం ఓ కార్యక్రమానికి హాజరైన ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రసంగించారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు అవిశ్వాసం తీసుకొస్తున్న ప్రతిపక్షాలపై ఆయన విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో తన ప్రభుత్వ పని తీరును సమర్థించుకున్నారు. భారత ఆర్మీ (indian army).. అక్కడి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసించారు. అలాగే భారత విదేశాంగ విధానం (india foreign policy) అద్భుతంగా ఉంటుందని, పౌరుల కోసం ఎంతకైనా తెగిస్తుందంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఇక భారత్‌.. ఏ ఒత్తిళ్లకూ తలొగ్గని దేశమని, ఆ విధానాలు ఆ దేశానికి ఎంతో మేలు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు ఇమ్రాన్‌ ఖాన్‌.

ఇక రాజీనామాపై స్పందిస్తూ.. రాజీనామాకు తాను ఎప్పటికైనా సిద్ధమని తేల్చిచెప్పారు. అలాగని విపక్షాల ఒత్తిళ్లకు తాను తలొగ్గనని, ఆర్మీకి డబ్బులిచ్చి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేనంటూ ఇమ్రాన్‌ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. ఆర్మీ చీఫ్ జనరల్ ఖనార్ జావెద్ బజ్వా ‘ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇది ఇస్లామిక్‌ కో ఆపరేషన్‌’ తర్వాత ఇమ్రాన్‌ ఖాన్‌ను రాజీనామా చేయాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 

ఇమ్రాన్ ఖాన్ ‌కు వ్యతిరేకంగా దిగువ సభలో విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో, దాన్నుంచి గట్టెక్కగలరా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. సైన్యం కూడా సాయం చేసేందుకు నిరాకరించిన నేపథ్యంలో, ఇమ్రాన్ ఖాన్ రేపు ఏంచేస్తారన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది. దిగువ సభలో అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో తనకు సాయం చేయాలంటూ సైనిక జనరళ్లను కలవగా, వారు సాయం నిరాకరించారంటూ కథనాలు వస్తున్నాయి. 

దేశంలో ఆర్థిక సంక్షోభానికి, ద్రవ్యోల్బణానికి ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పీటీఐ ప్రభుత్వమే కారణం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలతోనే ఈ నెల 8వ తేదీన నేషనల్ అసెంబ్లీ సెక్రెటేరియట్‌లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షాలు సమర్పించాయి. పీఎంఎల్-ఎన్, పీపీపీలకు చెందిన సుమారు 100 మంది చట్టసభ్యులు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ నెల 21న నేషనల్ అసెంబ్లీ సెషన్‌ను నిర్వహించనున్నారు. కాగా, 28వ తేదీన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగే అవకాశం ఉన్నది. సంయుక్త విపక్షాలు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కానీ, సొంత పార్టీకి చెందిన 24 చట్టసభ్యులూ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కూల్చడంలో పాలుపంచుకుంటామని గురువారం చెప్పడంతో ఇమ్రాన్ ఖాన్ షాక్‌కు గురయ్యారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే