H1B వీసా : అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన వారి గ్రేస్ పీరియడ్ 180 రోజులకు పెంపు..

By SumaBala BukkaFirst Published Mar 16, 2023, 12:12 PM IST
Highlights

అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వారి గ్రేస్ పీరియడ్ ను 180 రోజులకు పొడిగించింది.

వాషింగ్టన్ :  అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయి బాధపడుతున్న హెచ్ వన్ బి వీసాదారులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. హెచ్ వన్ బి వీసాదారులకు వీసా గడువు ప్రస్తుతం 60 రోజులుగా ఉంది. కాగా గ్రేస్ పీరియడ్ గా చెప్పే ఈ గడువును 180 రోజుల వరకు పొడిగించాల్సిందిగా బైడెన్ అధ్యక్ష సలహా ఉపసంఘం సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు కనక అమలులోకి వచ్చినట్లయితే అమెరికాలో ఉన్న భారతీయులతో సహా.. అక్కడ పనిచేస్తున్న వేలాది మంది విదేశీ ఉద్యోగులకు భారీ ఊరట లభించనుంది.

ఇటీవల కాలంలో మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ లాంటి సంస్థలు ఎక్కువ సంఖ్యలో తమ ఉద్యోగులను తొలగించాయి. ఈ నేపథ్యంలో చాలామంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న 60 రోజుల గడువులోగా కొత్త ఉద్యోగం సంపాదించుకోవడం వారికి కష్టతరంగా మారింది. దీంతో పాటు దరఖాస్తులు నింపే ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉండడంతో ఆ గడువు సరిపోవడం లేదు. 

న్యూజిలాండ్‌లోని కెర్మాడెక్ దీవులలో 7.1 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ..

అధ్యక్ష సలహా ఉపసంఘం సిఫార్సు చేసిన 180 రోజుల గ్రేస్ పీరియడ్ కనక అమలులోకి వస్తే.. ఆ లోగా కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి వెసులుబాటు కలుగుతుంది. ‘డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీకి, యూఎస్ పౌరసత్వ, వలస సేవల సంస్థ(యుఎస్ సిఐఎస్)లకు ఉపసంఘం.. ఉద్యోగం కోల్పోయిన హెచ్ వన్ బి ఉద్యోగుల గ్రేస్ పీరియడ్ను 60 రోజుల నుంచి 180 రోజులకు పొడిగించాలని సిఫార్సు చేసింది’  అని అధ్యక్ష సలహా ఉపసంఘంలో ఆసియా అమెరికన్ల సభ్యుడైన అజయ్ జైన్ బాటోరియా తెలిపారు. ఈ గ్రేస్ పీరియడ్ అంశంతో పాటు గ్రీన్ కార్డుల విషయం కూడా ఉపసంఘం ముందుకు వచ్చిందని అన్నారు అయితే, గ్రీన్ కార్డు దరఖాస్తుల ప్రారంభదశలో ఉద్యోగ ధృవీకరణ పత్రం ప్రతిపాదన పైన కూడా ఈ సందర్భంగా చర్చ జరిగిందని తెలిపారు. 

click me!