న్యూయార్క్‌లో రికార్డ్ బద్దలు కొట్టిన వర్షాలు.. ఎమర్జెన్సీ డిక్లేర్

By telugu teamFirst Published Sep 2, 2021, 1:17 PM IST
Highlights

అమెరికాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇదా తుఫాను బీభత్సం సృష్టిస్తున్నది. గత రెండు రోజులుగా న్యూయార్క్, న్యూజెర్సీలో కుండపోత వర్షాలు కురిశాయి. ఫలితంగా వీధులు వరద నీటితో నిండిపోయాయి. న్యూయార్క్ నగర మేయర్ ఎమర్జెన్సీ విధించారు. ప్రజలు బయటకు రావొద్దని సూచించారు.

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో వర్షాలు దంచికొట్టాయి. తొలిసారి ఊహించని రీతిలో వర్షాలు ముంచెత్తాయి. రికార్డు బ్రేక్ చేస్తూ కురిసినవానలకు న్యూయార్క్ సహా న్యూజెర్సీ రాష్ట్రమూ అతలాకుతలమైంది. వెంటనే న్యూయార్క్ సిటీ మేయర్ ఎమర్జెన్సీ విధించారు. న్యూయార్క్ నగర వీధులు వరదలతో మునిగిపోయాయి. సబ్ వేలూ నీళ్లతో నిండిపోయాయి. కొంతకాలం ఎమర్జెన్సీ సేవలు మినహా మరే వాహనాలూ బయటకు రావొద్దని అధికారులు ఆదేశించారు. న్యూయార్క్ చరిత్రలో తొలిసారిగా ఇంతటి వర్షం కురిసినట్టు నిపుణులు చెబుతున్నారు.

తమ చరిత్రలో తొలిసారి కఠిన పరిస్థితులను న్యూయార్క్ వాసులు ఎదుర్కొంటున్నారని మేయర్ తెలిపారు. సిటీలో రికార్డులు తిరగరాస్తూ వర్షాలు కురుస్తున్నాయని వివరించారు. అందుకే న్యూయార్క్ సిటీలో ఎమర్జెన్సీ విధించినట్టు చెప్పారు. ప్రజలు బయటకు రాకుండా సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని, వీధుల్లోకి రావద్దని హెచ్చరించారు.

దక్షిణాదిలోని లూసియానా రాష్ట్రంలో తొలిసారిగా ఇదా తుఫాన్ బీభత్సం సృష్టించింది. తర్వాత ఇదే తుఫాను ఇప్పుడు న్యూయార్క్, న్యూజెర్సీలను వణికిస్తున్నది. వీటికితోడు టోర్నడోలూ అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ఇక్కడి నెవార్క్ లాగార్డియా జేఎఫ్‌కే ఎయిర్‌పోర్టులో వందలాది విమానాల రాకపోకలను అధికారులు రద్దు చేశారు. ప్రధానమైన దారులు మూసేశారు. మాన్హట్టాన్, ది బ్రాంక్స్, క్వీన్స్ లాంటి పట్టణాల్లో దారులు పూర్తిగా క్లోజ్ చేశారు.

యూఎస్‌లోని దక్షిణాది రాష్ట్రాల్లో హారికేన్లు సర్వసాధారణమే. పర్యావరణ మార్పులతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం, తుఫాన్ చర్యలు పెరగడం వంటి వాటిని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తీరప్రాంతాలకు పెనుముప్పు పొంచి ఉందని అభిప్రాయపడుతున్నారు.

click me!